
Election Commission: ఎన్నికల ప్రక్షాళనలో మరో ముందడుగు.. ఓటరు కార్డు-ఆధార్ లింకింగ్‌పై ఈసీ స్పష్టత
ఈ వార్తాకథనం ఏంటి
త్వరలోనే ఓటర్ ఐడీని ఆధార్‌తో అనుసంధానించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దిల్లీలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఓటర్ ఐడీ, ఆధార్ అనుసంధానం ప్రాముఖ్యత, సాంకేతిక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఈసీ సభ్యులు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవో, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
Details
రాజ్యాంగపరమైన అనుసంధానం
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం, భారతీయ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని సమావేశంలో స్పష్టంచేశారు.
ఓటర్ ఐడీ, ఆధార్ అనుసంధానం ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉండాలని నిర్ణయించారు.
ఈ ప్రక్రియలో ఉన్న సాంకేతిక అంశాలపై మరింత లోతుగా చర్చించేందుకు UIDAI అధికారులతో మరో కీలక సమావేశం త్వరలో నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది.
Details
ఎన్నికల సంస్కరణలపై ప్రతిపక్షాల విమర్శలు
ఇటీవల ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల సరైన నిర్వహణపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండడంతో, కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని కీలక చర్యలు చేపట్టింది.
ఎన్నికల వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలను ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించింది.
ఏప్రిల్ 30 నాటికి ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరించనున్నట్లు ఈసీ స్పష్టం చేసింది.