Mamata Banerjee: టీఎంసీలో మరో కలకలం.. మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు టీఎంసీ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, మహువా మోయిత్రాలకు లీగల్ నోటీసులు పంపించారు. బరసత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను పార్టీ టికెట్ కోరినట్లు చేసిన ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బరసత్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు కొందరు తనను సంప్రదించారని తెలిపారు.
వివరాలు
తాను ఏ పదవి కోసం ఆశపడలేదు
అయితే పార్టీ సీనియర్ నేతలు అందుకు అంగీకరించకపోవడంతో ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ఒకరు ఎంపీ అయినంత మాత్రాన వారి కుటుంబ సభ్యులంతా ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలా అంటూ పరోక్షంగా కకోలీ ఘోష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కకోలీ ఘోష్ టీఎంసీకి దూరమైన తర్వాత, తన కుమారుడికి టికెట్ ఇవ్వనందుకే ఆమె ఎన్డీఏకు మద్దతు పలికారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఆరోపణలను డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పుడూ ఏ పదవి కోసం ఆశపడలేదని స్పష్టం చేశారు. తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకే మమతా బెనర్జీతో పాటు ఇతర టీఎంసీ నేతలకు లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు.