
నందమూరి కుటుంబంలో మరో విషాదం- హీరో బాలకృష్ణ సోదరుడికి యాక్సిడెంట్
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో నందమూరి రామకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో నందమూరి రామకృష్ణ తృటిలో తప్పించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. అలాగే, ప్రమాదానికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
బాలకృష్ణ
ఇటీవలే తారకరత్నకు గుండెపోటు
నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకోవడంతో నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా నందమూరి తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. నారా లోకేష్ పాదయాత్రలో కుప్పకూలిన ఆయన ప్రస్తుతం బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తారకరత్న క్రమంగా కోలుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే నందమూరి కుటుంబ సభ్యులు వరుస రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో నందమూరి హరికృష్ణ, నందమూరి జానకిరామ్‌లు కారు ప్రమాదంలో మరణించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా కాలం క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
నందమూరి రామకృష్ణ ఇటీవల బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నను పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.