West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం.. 11 ఏళ్ల బాలిక హత్య..?
కోల్‌కతాలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటన మరవకముందే బెంగాల్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కోచింగ్ క్లాస్‌కు వెళ్ళిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. సౌత్ 24 పరగణాస్ జిల్లాలో నివసిస్తున్న బాలిక శుక్రవారం ఉదయం కోచింగ్ క్లాస్‌కు వెళ్లింది. రాత్రి వరకు ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం గాలిస్తున్న క్రమంలో, శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఒక పొలం వద్ద ఆమె మృతదేహం కనబడింది. బాలిక ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులు ఆమెను కిడ్నాప్ చేసి హతమార్చారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మోస్తకిన్ సర్దార్ అనే 19 సంవత్సరాల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్‌పై దాడి చేసి, అవుట్ పోస్ట్‌ను నిప్పు పెట్టారు. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు భద్రతా బృందాలు వచ్చాయి. బెంగాల్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.