Page Loader
ANSR: విశాఖలో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు.. రాబోయే ఐదేళ్లలో 10,000 మందికిపైగా ఉద్యోగాలు
విశాఖలో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు.. రాబోయే ఐదేళ్లలో 10,000 మందికిపైగా ఉద్యోగాలు

ANSR: విశాఖలో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ ఏర్పాటు.. రాబోయే ఐదేళ్లలో 10,000 మందికిపైగా ఉద్యోగాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి మరింత బలాన్నిచ్చేలా, అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) స్థాపన కోసం పేరుప్రఖ్యాతులు సంపాదించిన ఏఎన్ఎస్ఆర్ సంస్థ విశాఖపట్నం మధురవాడలో భారీ స్థాయిలో క్యాంపస్ నిర్మించేందుకు ముందుకొచ్చింది. మధురవాడ ఐటీ క్లస్టర్‌లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో వచ్చే ఐదేళ్లలో 10,000 మందికి పైగా నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

వివరాలు 

నారా లోకేశ్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు

మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంలో ఏఎన్ఎస్ఆర్ సీఈఓ లలిత్ అహూజా మాట్లాడుతూ, "విశాఖలో ఉన్న అద్భుతమైన మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన ప్రతిభ, ప్రగతిశీల నాయకత్వం - ఇవన్నీ కలసి విశాఖను భవిష్యత్తు జీఎస్సీ అభివృద్ధికి సరైన కేంద్రంగా మార్చనున్నాయి. మా ఇన్నోవేషన్ క్యాంపస్ ద్వారా విశాఖను గ్లోబల్ కార్పొరేట్ సంస్థలకు ముఖ్య గమ్యంగా అభివృద్ధి చేస్తాం" అన్నారు. రాష్ట్ర ప్రతిభను ప్రపంచ కంపెనీలతో ముడిపెట్టి అవకాశాలను కల్పించడంలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.

వివరాలు 

విశాఖను జీసీసీల కేంద్రంగా తీర్చిదిద్దతాం: మంత్రి నారా లోకేశ్ 

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. "మేము రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. అందులో ఐటీ, జీసీసీ రంగాల్లోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పం ఉంది. ఈ యాత్రను విశాఖపట్నం నుంచే ప్రారంభించాం" అని చెప్పారు. బెంగళూరును వ్యాపారానికి అనువైన నగరంగా, గోవాను జీవనశైలికి ఉత్తమ నగరంగా పేర్కొంటూ, ఈ రెండు నగరాల శ్రేష్టతలను కలిపిన రూపంలో విశాఖను అభివృద్ధి చేయాలన్నదే తమ దృష్టి అన్నారు.

వివరాలు 

టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి

జీసీసీలను రాష్ట్ర ఆర్థిక వ్యూహంలో ముఖ్య భాగంగా మార్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని, ఇప్పటికే కొన్ని ప్రముఖ కంపెనీలకు అత్యల్ప ధరలకే భూములు కేటాయించామని మంత్రి తెలిపారు. "టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమిని కేటాయించాం. దీనివల్ల మా 5 లక్షల ఉద్యోగాల లక్ష్యంలో ఇప్పటికే 12 శాతం సాధించగలిగాం. ఇప్పుడు మేము టాప్-100 ఐటీ కంపెనీలను రాష్ట్రంలోకి ఆహ్వానించాలన్న సంకల్పంతో ఉన్నాం" అని చెప్పారు. అమెరికాకు వెలుపల గూగుల్ తన అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తున్నదని, అలాగే దేశంలోనే అతిపెద్ద డేటా సిటీకూ ఇదే కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

వివరాలు 

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే.. విశాఖకు గ్లోబల్ కనెక్టివిటీ

కేవలం పెట్టుబడిదారులకు సదుపాయాలు కల్పించడం మాత్రమే కాకుండా, జీసీసీలకు అవసరమైన నైపుణ్య శిక్షణనూ అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ కల్పించేందుకు పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే, విశాఖకు గ్లోబల్ కనెక్టివిటీ మరింత పెరుగుతుందని చెప్పారు. విశాఖను జీసీసీల అంతర్జాతీయ రాజధానిగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో పారిశ్రామిక రంగం కూడా భాగస్వామ్యమవ్వాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విశాఖలో జిసిసి ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పందం!.