
Haryana: వరదలు వస్తే ఏ నగరమైనా మునిగిపోతుంది : హర్యానా సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలోని మిలియన్ సిటీ గురుగ్రామ్ భారీ వర్షాలతో పూర్తిగా జలమయం అయ్యింది. పలు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జలమయమైన రోడ్లు, నీటిలో ఇరుక్కున్న వాహనాలు.. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక ప్రభుత్వంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మీమ్స్‌తో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో హరియాణా సీఎం నయాబ్ సింగ్ సైనీ స్పందించారు. వరదలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వరదలు వస్తే ఏ నగరమైనా మునిగిపోతుంది.
Details
ప్రకృతిని ఎవరూ అడ్డుకోలేరు
అమెరికాలోని కాలిఫోర్నియా నగరం మునిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రకృతిని ఎవరూ ఎదుర్కోలేరు. భారీ వర్షాలు నష్టాన్ని కలిగించడంలో ఆశ్చర్యం ఏమీ లేదని సీఎం వ్యాఖ్యానించారు. అలాగే, వరదల పరిస్థితిని కట్టడి చేయడానికి రక్షణ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, సీఎం పేర్కొన్నారు. గురుగ్రామ్ అభివృద్ధి చెందుతున్న నగరమని.. ఇలాంటి అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనగల సామర్థ్యాన్ని కలిగిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తామన్నారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి.
Details
సీఎం వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందన
ట్రాఫిక్ జామ్‌లు, ఇబ్బందులకు గురైన ప్రయాణికులు, నీటిలో నిలిచిపోయిన వాహనాలు.. ఇవన్నీ ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రజలు పోస్టు చేస్తూ ప్రభుత్వ యంత్రాంగం తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇక సీఎం చేసిన వ్యాఖ్యలపై కొంతమంది నెటిజన్లు స్పందించారు. కొందరు ప్రకృతికి ఎవ్వరూ అడ్డుకాలేరనే వ్యాఖ్యను సమర్థించగా, మరికొంతమంది మాత్రం నగర ప్రణాళిక లోపాల్ని కప్పిపుచ్చేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.