ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023: వ్యవసాయ రంగానికి రూ.41,436 కోట్ల కేటాయింపులు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రూ.41,436 కోట్లతో ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నామని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన అన్ని సేవలను గ్రామస్థాయిలో అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో 8,837 ఆర్‌బీకే భవనాలు ఉన్నాయని పేర్కొన్న మంత్రి కాకాణి, యూట్యూబ్ ఛానెల్‌లు, మాస పత్రికను ప్రారంభించడం ద్వారా ఆర్‌బీకేలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.6940 కోట్లు, రైతు భరోసా, కిసాన్ యోజన కింద రూ.7220 కోట్లు అందించామని, రైతులకు సార్వత్రిక బీమా పథకాన్ని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని కాకాణి తెలిపారు.
రూ.6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేశా: కాకాణి
50,000 టన్నుల ఎరువులను నిల్వ చేస్తున్నామని, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల పర్యవేక్షణకు వ్యవసాయ సలహా మండలాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు ఎన్నడూ కరువును ఎదుర్కోలేదని, రూ.6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేశామన్నారు. 3.50 లక్షల మంది సన్నకారు రైతులకు స్ప్రేయర్లకు సంబంధించిన సబ్సిడీని పొడిగించినట్లు మంత్రి పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. హెక్టారుకు రూ.6వేలు ప్రోత్సాహకం అందించి చిరుధాన్యాల సమగ్ర సాగు విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకుంటున్నామని మంత్రి తెలిపారు.