Journalist houses In Ap : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. కొనసాగుతున్న భేటీ
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశమైంది. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 38 ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించిన కేబినెట్, రాష్ట్రంలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ క్రమంలోనే మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇదే సమయంలో ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు రూ.19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. అలాగే, పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు, 6790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది.
నేషనల్ లా వర్సిటీ కోసం 100 ఎకరాల స్థలం కేటాయింపు
మరోవైపు ఏపీలో పరిశ్రమలకు కొత్త భూ కేటాయింపు విధానాన్ని ఆమోదించింది. కర్నూలులో జాతీయ లా యూనివర్సిటీకి మరో 100 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ సమావేశ మందిరంలో ప్రారంభమైన భేటీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోంది. సమావేశంలో మరిన్ని కీలక అంశాలపై చర్చిస్తూ నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు (పాత్రికేయులకు) ఇచ్చిన హామీని వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.