AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు...30 అంశాలకు కేబినెట్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధి, సాంకేతిక రంగ విస్తరణ, రహదారి భద్రతకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం లభించింది. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్లు, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, బ్యాటరీ తయారీ వంటి రంగాల్లో కొత్త పెట్టుబడులకు మార్గం సుగమం చేసే ప్రతిపాదనలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రావడంతో పాటు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Details
ఏఐ, రోబోటిక్స్ రంగాలకు ప్రాధాన్యం
2026-31 కాలానికి సంబంధించిన ఏపీ ఏవీజీసీ-ఎక్స్‌ఆర్ (AVGC-XR) పాలసీకి, 2036 వరకు అమల్లో ఉండే రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అమనాంలో 512 మెగావాట్ల సామర్థ్యంతో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకరించింది.
సెమీకండక్టర్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ-4.0లో సవరణలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాలు రాష్ట్రాన్ని సాంకేతిక పరిశ్రమలకు అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా కనిపిస్తున్నాయి.
Details
కొత్త పరిశ్రమలు.. ఉపాధికి అవకాశం
ఇతర పారిశ్రామిక ప్రతిపాదనలకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లాలో ఫుట్‌వేర్ కాంపోనెంట్ పార్కు, ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో FLO మహిళా పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానున్నాయి.
నాయుడుపేటలో లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కూడా అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల కార్యకలాపాలు పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Details
రోడ్డు భద్రతకు ప్రత్యేక డైరెక్టరేట్
హోంశాఖ ప్రతిపాదన మేరకు మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయంపై మంత్రులు అతిగా సంబరపడకుండా మరింత బాధ్యతగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు.
2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.