LOADING...
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతి నుంచి పోలవరం వరకు 37 ప్రతిపాదనలకు ఆమోదం
అమరావతి నుంచి పోలవరం వరకు 37 ప్రతిపాదనలకు ఆమోదం

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతి నుంచి పోలవరం వరకు 37 ప్రతిపాదనలకు ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన 37 కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పర్యాటక రంగం, విమానయాన విధానం, ఉపాధి అవకాశాల కల్పన, అవయవ దానాల నియంత్రణ వంటి పలు అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు.

వివరాలు 

అమరావతి అభివృద్ధికి భారీ కేటాయింపులు

అమరావతి హైకోర్టు భవన సముదాయంలో ప్రీకాస్ట్ ఫిన్స్, వాటర్‌బాడీలు, బాహ్య రహదారుల నిర్మాణ పనుల కోసం రూ.547.07 కోట్ల నిధులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కృష్ణా నది తీరంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో డీబీఎఫ్ఓటీ విధానంలో 'అమరావతి ఐ' ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు టెండర్ల ఆహ్వానానికి అనుమతి ఇచ్చింది. అమరావతిని అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన 'అమరావతి క్వాంటం వ్యాలీ' ప్రాజెక్టుకు కేటాయించిన 49.66 ఎకరాల భూమిపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా మినహాయించింది. అదే సమయంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బంగ్లాల్లో హోమ్ ఆటోమేషన్, ఆధునిక సదుపాయాల ఏర్పాటుకు రూ.94.90 కోట్ల ఎల్-1 బిడ్‌కు ఆమోదం తెలిపింది.

వివరాలు 

భూముల విధానం, పర్యాటక రంగానికి ప్రోత్సాహం

రాజధాని ప్రాంతంలోని ల్యాండ్ పూలింగ్ భూములకు సంబంధించిన నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ సవరణ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించింది. విశాఖపట్నంలోని మధురవాడలో స్టార్ హోటళ్లు, రిసార్టుల అభివృద్ధి కోసం ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని బదిలీ చేయాలని నిర్ణయించింది. పర్యాటక రంగానికి మరింత ఊతమివ్వాలనే ఉద్దేశంతో చీరాల, విశాఖపట్నం తీర ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా బీచ్ షాక్ ఎక్సైజ్ పాలసీ అమలుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Advertisement

వివరాలు 

ఏవియేషన్, ఫైబర్‌నెట్ రంగాలకు ఊతం

రాష్ట్రంలో విమానయాన రంగాన్నివిస్తరించడంతో పాటు అడ్వాన్స్‌డ్ ఎయిర్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు రూపొందించిన 'ఏపీ ఏవియేషన్ పాలసీ 2026-31'కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ ఫైబర్‌నెట్ సేవలను మరింత విస్తరించేందుకు హడ్కో నుంచి రూ.300 కోట్ల రుణం తీసుకునే విషయంలో ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించింది. పోర్టుల కనెక్టివిటీ,పోలవరం పనులకు ఆమోదం రాష్ట్రంలోని గ్రీన్‌ఫీల్డ్ పోర్టులకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచే లక్ష్యంతో జాతీయ రహదారి-216 నుంచి రోడ్డు,రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి కోసం ఏపీ మారిటైమ్ బోర్డుకు అవసరమైన భూములను కేటాయించింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని ప్యాకేజీలు 5, 5ఏలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు రూ.796.66కోట్ల సవరించిన పరిపాలనా ఆమోదాన్ని కూడా మంజూరు చేసింది.

Advertisement

వివరాలు 

ఉపాధి, గ్రామీణాభివృద్ధికి కొత్త కార్యక్రమం

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, జీవనోపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల 60:40 నిష్పత్తిలో అమలు చేయనున్న 'వికసిత్ భారత్-రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ)' కార్యక్రమాన్ని జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. అవయవ దానాలపై సవరణ ఆర్డినెన్స్ అవయవ దానాలు, అవయవ మార్పిడి ప్రక్రియలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు 'మానవ అవయవాల మార్పిడి సవరణ ఆర్డినెన్స్-2026'కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా కాకినాడ అర్బన్ పరిధిలో టీడీపీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం కోసం 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని 66 ఏళ్ల లీజుకు కేటాయించే ప్రతిపాదనను కూడా పరిశీలించింది.

వివరాలు 

ఇతర కీలక నిర్ణయాలు

అగ్రిగోల్డ్ కేసులు, డిపాజిటర్ల రక్షణ చట్టం (APPDFE) కేసుల విచారణను వేగవంతం చేయడానికి అదనంగా 21 పోస్టులను మంజూరు చేసింది. అలాగే వట్టిచెరుకూరు గ్రామ పరిధిలోని 25.37 ఎకరాల భూమిని 'చెరువు పోరంబోకు' నుంచి 'గ్రామ కంఠం'గా మార్చుతూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను క్రమబద్ధీకరించింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల పెంపు, అభివృద్ధి వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.

Advertisement