Loading...
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..10,060ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్'లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2026-27 జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగ నియామకాలతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో రూ.2.08 లక్షల కోట్ల అంచనా పెట్టుబడులతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పట్టణ స్థానిక సంస్థల్లో హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (HAM) కింద రహదారులు, కాల్వలు, విద్యుత్‌ సదుపాయాలు, పార్కుల అభివృద్ధి పనులకు రూ.7,469.46 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

వివరాలు 

డేటా సెంటర్లు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

హంద్రీ నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్‌-2 పనులకు రూ.1,323.75 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చింది.

శ్రీసత్యసాయి జిల్లాలో 400.50 కిలోమీటర్ల నుంచి 485.300/490 కిలోమీటర్ల వరకు మెయిన్‌ కెనాల్‌కు సీసీ లైనింగ్‌ పనులు చేపట్టేందుకు రూ.750.07 కోట్లను కేటాయించింది.

అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మెయిన్‌ కెనాల్‌ పనులకు మరో రూ.573.68 కోట్లను మంజూరు చేసింది.

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం వద్ద 486 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు డేటా సెంటర్‌ హోల్డింగ్స్‌ ఇండియాకు 200 ఎకరాల భూమి కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఈ సంస్థకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రోత్సాహకాలను కూడా మంజూరు చేయనుంది.

వివరాలు 

డేటా సెంటర్లు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

తిరుపతిలో మునోత్‌ లిథియం బ్యాటరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.500కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న లిథియం-అయాన్‌ సెల్‌ తయారీ ప్లాంట్‌కు కూడా అనుమతి ఇచ్చింది.

వైఎస్సార్‌ ఈఎంసీ కొప్పర్తిలో ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ ప్రాజెక్టులో రూ.450కోట్ల పెట్టుబడి పెట్టనుండగా,సుమారు 7వేల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా నిర్ణయించారు.

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వద్ద 1,000మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రెన్యూ ఏపీ గ్రీన్‌ డేటా సెంటర్‌ లిమిటెడ్‌కు 433.30ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం లభించింది.

ఈ ప్రాజెక్టు ద్వారా రూ.85,200కోట్ల పెట్టుబడి రానుండగా,1,880మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. సంస్థకు అవసరమైన ప్రోత్సాహకాల మంజూరుకు కూడా కేబినెట్‌ అంగీకరించింది.

ADVERTISEMENT

వివరాలు 

డేటా సెంటర్లు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం అమనం వద్ద 512 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఏఎం ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్‌కు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు మంజూరు చేయాలని నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టులో రూ.31,387 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, సుమారు 1,000 మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు వద్ద అగస్త్య గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 12 గిగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ ఫెసిలిటీతో ఎస్‌ఐ ఇంగోట్‌, వేఫర్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ అనుమతించింది.

ఇందుకోసం 143.26 ఎకరాల భూమిని ఎకరాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

డేటా సెంటర్లు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

విశాఖపట్నం పరవాడ పారిశ్రామికవాడ సమీపంలో అక్షత్‌ గ్రీన్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 3.6 గిగావాట్ల సామర్థ్యంతో టాప్‌కాన్‌ సోలార్‌ సెల్‌, మాడ్యూల్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఏకర్లపల్లి వద్ద అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్‌ ప్రాజెక్టును విస్తరించేందుకు హిందాల్కో ఇండస్ట్రీస్‌కు 60 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్‌ అంగీకరించింది.

వివరాలు 

అమరావతి రైల్వే లైన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కోసం భూసమీకరణ

రాజధాని అమరావతిలో ఎర్రుబాలెం-నంబూరు మధ్య కొత్త బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ నిర్మాణంతో పాటు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

రైల్వే లైన్‌కు ఇరువైపులా 50 మీటర్ల చొప్పున, మొత్తం 100 మీటర్ల బఫర్‌ పరిధిని పరిగణనలోకి తీసుకోనున్నారు.

ఈ పనుల కోసం గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో 2,344.12 ఎకరాల భూమిని భూసమీకరణ విధానంలో తీసుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారాలు కల్పిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది.

వివరాలు 

అమరావతి రైల్వే లైన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కోసం భూసమీకరణ

రాజధాని ప్రాంతంలో రెండో విడత భూసమీకరణ పథకంలో భాగంగా గుంటూరు జిల్లా వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లోని దేవాదాయ భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు మరో నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు దేవాదాయ శాఖకు రూ.159.45 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.

అలాగే రైత్వారీ పట్టాలు కలిగిన రైతులకు భూసమీకరణ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను వర్తింపజేసే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

ADVERTISEMENT