AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడానికి మంత్రివర్గం ఆమోదించింది. నగదుతో సిలిండర్ కొనుగోలు చేస్తే, 48 గంటల్లోనే ఆ మొత్తాన్ని తిరిగి అకౌంట్‌లో జమ చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఒకేసారి మూడు సిలిండర్లు ఇవ్వకుండా, ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ అందించాలనే నిర్ణయమైంది. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2700 కోట్ల బరువు పడుతుందని చర్చలో వెల్లడైంది.
ఇసుక పంపిణీని పూర్తిగా ఉచితం
ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దుకు మంత్రివర్గం ఆమోదించింది. సీనరేజ్ ఛార్జీల రద్దు వల్ల ప్రభుత్వానికి రూ.264 కోట్ల భారమవుతుందని అంచనా వేశారు. ఉచిత ఇసుకను సక్రియంగా అమలుకు తీసుకురావడానికి నష్టం భరిద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం.. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుకను సరిగ్గా అమలు చేయడానికి మంత్రులు,జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్ డీలర్లను నియమించి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వడానికి, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్ ఆమోదించింది.
విశాఖ శారదాపీఠానికి భూ కేటాయింపు రద్దు
విశాఖకు చెందిన వివాదాస్పద పీఠాధిపతి స్వరూపానందేంద్రకి చెందిన శారదాపీఠానికి జగన్ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వైసీపీ ప్రభుత్వ కాలంలో అప్పటి సీఎం జగన్, తన గురువు మరియు అత్యంత సన్నిహితుడైన స్వరూపానందేంద్ర కోరినట్లు, భీమిలి పట్టణానికి సమీపంలో కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్రతీరానికి దగ్గరగా రూ. కోట్ల విలువైన భూమిని ఎకరానికి రూ. లక్ష చొప్పున అడ్డగోలుగా కేటాయించారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమ భూ కేటాయింపులపై సమీక్షలో భాగంగా ఎన్డీయే ప్రభుత్వం దీన్ని గుర్తించింది మరియు శారదాపీఠానికి భూముల కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది.