Cabinet Meeting: ఇవాళ ఏపీ కేబినేట్ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 4 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులు, రాజధాని అమరావతి పనుల టెండర్ల రద్దు, ఈనామ్ భూముల అంశం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ జరగనుంది. ఇప్పటికే స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ.85,083 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా 33,966 కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేబినెట్‌లో ఈ నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. రాజధాని అమరావతిలో గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనులపై సమీక్ష చేపట్టి, వాటి టెండర్ల రద్దుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.
ల్యాండ్ పూలింగ్ విధానంపై పరిశ్రమల కోసం ప్రణాళికలు
పరిశ్రమల అభివృద్ధి కోసం ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రత్యేకంగా అర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కోసం అవసరమైన భూముల సేకరణపై దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 61 వేల మందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ అంశంపై కూడా ఈరోజు కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ రోజు జరగనున్న కేబినెట్ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, సామాజిక సంక్షేమానికి సంబంధించిన అనేక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది.