CM Chandrababu: ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు.. ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలకు ఆమోదం
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ బుధవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో ఆరు కొత్త పారిశ్రామిక విధానాలపై చర్చ జరిగింది. అలాగే, మాదక ద్రవ్యాల నియంత్రణ, అక్రమ మద్యం అమ్మకాలు అరికట్టేందుకు, పునరావాసంపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్
సీఎం చంద్రబాబు "వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్" అనే నినాదంతో కూటమి ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాలు అమలు చేస్తుందని వెల్లడించారు. ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేబినెట్ సమావేశంలో ఆరు కొత్త పారిశ్రామిక విధానాలకు ఆమోదం లభించిందని తెలిపారు. తమ విధానం 'థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ' అని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
కేబినెట్ ఆమోదించిన కొత్త పారిశ్రామిక విధానాలు
ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం ఏపీ ఎంఎస్ఎంఈ & ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ ఏపీ ప్రైవేట్ పార్కుల విధానం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రతి కుటుంబం ఒక చిన్న పరిశ్రమ ఏపీకి నాలెడ్జ్ ఎకానమీతో పాటు అగ్రో, ఆక్వా, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక బలాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తామన్నారు.ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని,ప్రతి కుటుంబం ఒక చిన్న పరిశ్రమ ప్రారంభించేందుకు అవసరమైన శిక్షణ,ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నాలెడ్జ్ ఎకానమీతో ఉపాధి అవకాశాలు
ప్రతి పారిశ్రామిక విధానంలో ఉద్యోగ సృష్టికి ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. ఇంతకు ముందు ఎన్ని పెట్టుబడులు వచ్చాయనేది మాత్రమే అడిగేవారని, ఇప్పుడు ఆ పెట్టుబడులు ఎంత మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయన్న దాని మీద దృష్టి పెట్టామని చెప్పారు. ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీ ద్వారా సేవలందించడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు పెరిగాయని చంద్రబాబు అన్నారు. యువత ఉద్యోగాలు చేసేవారు కాకుండా, ఉద్యోగాలను కల్పించేలా మారాలన్నారు. గతంలో ఐటీ పాలసీకి 25 ఏళ్లు అవుతుందని, ఇంజినీరింగ్ కాలేజీలు, కంపెనీలు పెరిగినట్టు చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన ఆరు పారిశ్రామిక విధానాలు రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు కీలక మార్పులు తీసుకొస్తాయన్నారు.
క్లీన్ ఎనర్జీపై దృష్టి
ఏపీలో పునరుద్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్ వినియోగం పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024-29కి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030 నాటికి ప్రతి ఇంటా ఒక పారిశ్రామిక వేత్త అనే లక్ష్యంతో రూపొందించిన ఎంఎస్ఎంఈ పాలసీకి కూడా కేబినెట్ ముద్ర వేసింది.