Page Loader
ECI: 5,600 మంది CRPF బలగాల పహారాలో కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు: సీఈవో ఎంకే మీనా

ECI: 5,600 మంది CRPF బలగాల పహారాలో కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు: సీఈవో ఎంకే మీనా

వ్రాసిన వారు Stalin
Jun 03, 2024
06:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్'లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందని..ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను.. తర్వాత ఈవీఎం బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారని తెలిపారు. ఈసారి పోస్టల్‌ బ్యాలెట్లు ఎక్కువగా రావడంతో వీటికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీలో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని.. 4.61 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్నారని తెలిపారు. 26,473 మంది హౌమ్‌ ఓటింగ్‌ ద్వారా ఓటు వేసినట్లు తెలిపారు. 26,721 మంది సర్వీసు ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్‌ విధానంలో ఓటు వేసినట్లు తెలిపారు.

Details 

పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ముందు, ఈవీఎం టేబుళ్లు సిద్ధం: ఎంకే మీనా 

పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు.. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్‌ బ్యాలెట్‌ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించిందన్నారు. ప్రతి కౌంటింగ్‌ హాలులో కౌంటింగ్‌ ఏజెంట్లు ఉంటారని.. ప్రతి సెంటర్‌లో మీడియా రూమ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉందని.. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరించామని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో మొబైల్‌ ఫోన్లు అనుమతించేది లేదని.. మీడియాకు మాత్రం నిర్దేశించిన వరకు ఫోన్లు తీసుకెళ్లవచ్చని తెలిపారు.

Details 

సోషల్ మీడియా పై డేగ కన్ను: డిజిపి 

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా ఎవరు ప్రయత్నించినా కఠిన చర్యలు తప్పవని హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. మరో వైపు 5,600 మంది CRPF బలగాలను సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించారు. వీటిని పర్యవేక్షణకు IG చారు సిన్హా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. మరో వైపు ఓట్ల లెక్కింపు రోజున మద్యం షాపులను మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.