
Andhra: మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం..'జీరో ఫేర్ టిక్కెట్' ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు 'జీరో ఫేర్ టిక్కెట్' ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రయాణించే ప్రాంతం ఏది? ఎంత దూరం ప్రయాణించారు? ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వారికి ఎంత మొత్తంలో డబ్బులు ఆదా అయ్యాయో వంటి వివరాలను టిక్కెట్‌పై ప్రదర్శించేలా చూడాలని అధికారులకు సూచించారు. అదే విధంగా,ప్రభుత్వమే 100శాతం ఇస్తున్న రాయితీ వివరాలు కూడా టిక్కెట్‌లో స్పష్టంగా చూపించాలన్నారు.
వివరాలు
'జీరో ఫేర్ టిక్కెట్' ద్వారా మహిళలకు ప్రయోజనం
ఈ అంశంపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. 'జీరో ఫేర్ టిక్కెట్' ద్వారా మహిళలకు ప్రయోజనం ఏంటో, ఎంత లబ్ధి పొందుతున్నారో ప్రతి మహిళా ప్రయాణికుడికి స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా చేయాలన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఇతర రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడిందో, మన రాష్ట్రానికి ఈ పథకం అమలుతో ఎంత వ్యయం కానుందనే అంశాలపై కూడా చంద్రబాబు అధికారులతో చర్చించారు.