పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్ నుంచి విశాఖలో పాలన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల కోసం ముందుకెళ్తున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పరిపాలన రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం పరిపాలన రాజధానిపై ఉన్న వివాదాలు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తొలుత అధికార నివాసంతో పాటు క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్టోబర్ లోగా వైజాగ్ నగరానికి తన ఆవాసం మార్చేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమచారం అందుతోంది. ఇదే క్రమంలో పాలనా యంత్రాంగాన్ని(ప్రభుత్వ ఉద్యోగులను) విశాఖకు తరలించడంపై త్వరలోనే స్పష్టత రానుంది. రుషికొండలో ఇప్పటికే సీఎం కార్యాలయానికి సంబంధించి భవనాలు ఏర్పాటయ్యాయని అధికార వర్గాలు అంటున్నాయి.
నలుదిక్కులా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటున్న ప్రభుత్వం
మరోవైపు అమరావతినే రాజధానిని కొనసాగించాలని అక్కడి రైతులు పలు కేసులు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత కాలంగా సీఎం అనుకున్న మూడు రాజధానులు ప్రతిపాదన ముందుకు సాగలేదు. ఇప్పటికీ ఆయా అంశాలపై కోర్టుల్లో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడ్నుంచైనా పరిపాలన చేసే సౌలభ్యం ముఖ్యమంత్రికి ఉంది. ఈ క్రమంలోనే అక్టోబర్ నెలలోగా విశాఖకు తరలివెళ్లేందుకు సీఎం జగన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏపీ అన్ని రంగాల్లో దూసుకెళ్లాలంటే అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదని, వికేంద్రీకరణ జరగాలని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో నలుదిక్కులా అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం అనుకున్నట్లుగా పనులు పూర్తైతే అక్టోబర్‌లో విశాఖకు మారడం ఖాయంగా కనిపిస్తోంది.