ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం.. గర్భిణీ కడుపులోనే కత్తెర మర్చిపోయిన వైద్యులు
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో ఘోరం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో బాధితురాలు నరకయాతన అనుభవించింది. బాధిత మహిళ కడుపులోనే ఆపరేషన్ చేసిన కత్తెరను మర్చిపోయి కుట్లు వేశారు. వారం కిందట కాన్పు నిమిత్తం ఓ గర్భిణీ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. పలు రకాల పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం ఆమెకు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు. అయితే సదరు మహిళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కడుపు నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు మరోసారి ఆగస్ట్ 8న ఏలూరి ఆస్పత్రికి వచ్చింది. ఎక్స్ రే తీసి ఆమెను పరీక్షించగా విస్తుబోయే విషయం వెల్లడైంది. కడుపులోనే కత్తెర ఉందని గుర్తించారు.
ఎక్స్ రే ఫొటోలు బహిర్గతమవడంతో స్పందించిన ఆస్పత్రి సూపరింటెండెంట్
కత్తెరను గుర్తించిన వెంటనే విజయవాడ ఆస్పత్రికి పంపించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శశిధర్ వెల్లడించారు. మరోవైపు ఆస్పత్రి రికార్డ్ నుంచి బాధితురాలి వివరాలు మాయం కావడం గమనార్హం. ఈ మేరకు వ్యవహారం బయటకు పొక్కకుండా అక్కడి డాక్టర్లు, వైద్యాధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. సదరు ఎక్స్ రే ఫొటోలను ఓ ఉద్యోగి తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో మొత్తం బండారం బయట పడింది. వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 19న ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఎస్ కొత్తపల్లికి చెందిన వి.స్వప్న కాన్పు నిమిత్తం ఏలూరు ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు సిజేరియన్ చేసి మగబిడ్డను బయటకు తీశారని బాధితురాలు పేర్కొన్నారు.