Loading...
Andhra Pradesh: ఏరోస్పేస్‌,రక్షణ రంగంలో ఏపీ దూకుడు.. రాష్ట్రానికి ఏడాదిలో రూ.27,610 కోట్ల పెట్టుబడులు
రాష్ట్రానికి ఏడాదిలో రూ.27,610 కోట్ల పెట్టుబడులు

Andhra Pradesh: ఏరోస్పేస్‌,రక్షణ రంగంలో ఏపీ దూకుడు.. రాష్ట్రానికి ఏడాదిలో రూ.27,610 కోట్ల పెట్టుబడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
08:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏరోస్పేస్‌, రక్షణ రంగ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ వేగంగా ఎదుగుతోంది. ఈ రంగాల్లో దేశీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, అనుసంధాన వ్యవస్థను కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆరు వ్యూహాత్మక క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్‌ విడిభాగాలు, క్షిపణులు, మందుగుండు సామగ్రి, అంతరిక్ష పరిశోధన, నౌకాయాన రంగం, ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్స్‌, అన్‌మ్యాన్డ్‌ డ్రోన్‌ల తయారీ వంటి కీలక రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది.

వివరాలు 

21,349 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం

2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.27,610 కోట్ల పెట్టుబడులతో 24 ప్రముఖ సంస్థలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 21,349 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అనుమతులు పొందిన సంస్థల్లో ఎక్కువశాతం ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించగా, రానున్న రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

ఇదే సమయంలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పాలసీ 4.0 ద్వారా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

వివరాలు 

జిల్లాల వారీగా భారీ పెట్టుబడులు

అనకాపల్లి జిల్లాలో భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ రూ.489 కోట్లతో, సాగర్‌ డిఫెన్స్‌ రూ.45 కోట్లతో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది.

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో క్షిపణులు, యామ్యునిషన్‌ తయారీ పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

కృష్ణా జిల్లాలో రూ.840 కోట్ల పెట్టుబడితో ఐకామ్‌ డిఫెన్స్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సంస్థకు పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభించాయి.

కర్నూలు జిల్లాలో ఆల్గోబొటిక్స్‌, డ్రోగో, ల్యాట్రిక్స్‌, సెన్స్‌ఇమేజ్‌, జేడీకే ఫ్లై సంస్థలు కలిపి రూ.407 కోట్ల పెట్టుబడులతో తయారీ యూనిట్లు నెలకొల్పనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

జిల్లాల వారీగా భారీ పెట్టుబడులు

శ్రీసత్యసాయి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్‌డీవో ఆధ్వర్యంలో పుట్టపర్తి వద్ద అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ) ప్రాజెక్టుతో పాటు, భారత్‌ ఫోర్జ్‌కు చెందిన కళ్యాణి స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌, హెచ్‌ఎఫ్‌సీఎల్‌, జేకే మణి, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆస్ట్రోబేస్‌ స్పేస్‌ తదితర సంస్థలు కలిసి రూ.21,210 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు పొందాయి.

అనంతపురం జిల్లాలో సరళ్‌ ఏవియేషన్‌, స్పేస్‌ఫీల్డ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు రూ.376.83 కోట్లతో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి.

తిరుపతి జిల్లా స్పేస్‌ సిటీలో ఎథర్నల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌, స్కైరూట్‌ సంస్థలు రాకెట్‌ ప్రయోగాలు, లాంచ్‌ వెహికల్‌ తయారీకి సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

జిల్లాల వారీగా భారీ పెట్టుబడులు

ప్రకాశం జిల్లాలో భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ రూ.978 కోట్ల పెట్టుబడితో ఎయిర్‌క్రాఫ్ట్‌ విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.

చిత్తూరు జిల్లాలో రూ.159 కోట్లతో పయనీర్‌ క్లీన్‌ ఎనర్జీస్‌ సంస్థ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

నెల్లూరు జిల్లాలో రక్షణ రంగానికి అవసరమైన క్షిపణులు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, మారిటైం రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల కోసం అనంత్‌ టెక్నాలజీస్‌, ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌, అనడ్రోన్‌ సిస్టమ్స్‌, సాగర్‌ డిఫెన్స్‌ సంస్థలకు మొత్తం రూ.1,765 కోట్ల పెట్టుబడులతో అనుమతులు లభించాయి.

వివరాలు 

వ్యూహాత్మకంగా ఆరు క్లస్టర్ల అభివృద్ధి

ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 23 వేల ఎకరాల్లో ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి ప్రధాన పారిశ్రామిక నగరాలకు అనుసంధానంగా ఈ క్లస్టర్లను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించింది.

తిరుపతి జిల్లా రౌతుసురమాలలో 2,500 ఎకరాల్లో స్పేస్‌ సిటీ ఏర్పాటు చేసి, పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దనుంది.

ప్రకాశం జిల్లా దొనకొండలో ఎయిర్‌క్రాఫ్ట్‌ విడిభాగాల తయారీకి అవసరమైన సమగ్ర ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయనుంది.

వివరాలు 

వ్యూహాత్మకంగా ఆరు క్లస్టర్ల అభివృద్ధి

విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కలిపి 3,000 ఎకరాల్లో నౌకాయాన రంగ పరిశ్రమల క్లస్టర్‌ను ఏర్పాటు చేయనుంది.

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో 3,000 ఎకరాల్లో క్షిపణులు, మందుగుండు సామగ్రి తయారీ పరిశ్రమల క్లస్టర్‌ను అభివృద్ధి చేయనుంది.

కర్నూలు జిల్లాలో 600 ఎకరాల్లో అన్‌మ్యాన్డ్‌ డ్రోన్‌ల తయారీ పరిశ్రమల క్లస్టర్‌ను ఏర్పాటు చేయనుంది.

శ్రీసత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలకు ప్రత్యేక క్లస్టర్‌ను అభివృద్ధి చేయనుంది.

రాష్ట్రంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు ఏరోస్పేస్‌, రక్షణ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదలతో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు రానుందని ప్రభుత్వం భావిస్తోంది.

ADVERTISEMENT