LOADING...
AP Engineering Admissions 2026: ఏపీలో 1.84 లక్షల ఇంజినీరింగ్ సీట్లకు గ్రీన్ సిగ్నల్..
ఏపీలో 1.84 లక్షల ఇంజినీరింగ్ సీట్లకు గ్రీన్ సిగ్నల్..

AP Engineering Admissions 2026: ఏపీలో 1.84 లక్షల ఇంజినీరింగ్ సీట్లకు గ్రీన్ సిగ్నల్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతుల ప్రక్రియను పూర్తి చేసింది. రాష్ట్రంలోని 234 ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 1,84,970 సీట్లకు ఆమోదం లభించింది. ఇందులో 17 ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో 6,130 సీట్లు, 217 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో 1,78,840 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోని వంద శాతం సీట్లను, ప్రైవేటు కళాశాలల్లోని మొత్తం సీట్లలో 70 శాతాన్ని ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనుంది. మిగిలిన సీట్లు యాజమాన్య కోటాలో ప్రవేశాలకు కేటాయిస్తారు.

వివరాలు 

తగ్గిన ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య

గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య తగ్గింది. గతేడాది 225 ప్రైవేటు కళాశాలలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 217కు చేరింది. కొన్ని కళాశాలలు ప్రైవేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలుగా మారడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. అలాగే ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య కూడా 18 నుంచి 17కు తగ్గింది. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాలకు అనుమతి తీసుకోకపోవడం ఇందుకు కారణమైంది. అయితే సీట్ల పరంగా చూస్తే ఈ ఏడాది పెరుగుదల కనిపించింది. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో 390 సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 6,210 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి.

వివరాలు 

వర్సిటీల్లో కొత్త ఇంజినీరింగ్ కోర్సులు

ఈ విద్యా సంవత్సరంలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలో కొత్త ఇంజినీరింగ్ బ్రాంచీలను ప్రారంభించారు. డాక్టర్ వైఎస్సార్ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సివిల్ ఇంజినీరింగ్ (కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ)కోర్సులను ఒక్కో విభాగంలో 60 సీట్ల చొప్పున ప్రారంభించారు. జేఎన్‌టీయూ కలికిరి క్యాంపస్‌లో సీఎస్‌ఈ (ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్)విభాగంలో 60 సీట్లకు ఏఐసీటీఈ అనుమతి లభించింది. జేఎన్‌టీయూ పులివెందుల క్యాంపస్‌లో సీఎస్‌ఈ (ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్), ఈసీఈ విభాగాల్లో ఒక్కోటి 60 సీట్ల చొప్పున కొత్త అవకాశాలు కల్పించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఏఐ అండ్ డేటా సైన్స్ బ్రాంచికి 60 సీట్లతో కొత్త కోర్సును ప్రారంభించేందుకు ఆమోదం లభించింది.

Advertisement

వివరాలు 

సీఎస్‌ఈ కోర్సులకే భారీ డిమాండ్

రాష్ట్రంలోని మొత్తం ఇంజినీరింగ్ సీట్లలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ), దాని అనుబంధ కోర్సులకే అధిక ప్రాధాన్యం లభించింది. మొత్తం 1.84 లక్షల సీట్లలో 65.22 శాతం సీట్లు ఈ విభాగాలకు కేటాయించారు. దీంతో సీఎస్‌ఈ, అనుబంధ బ్రాంచీల్లోనే దాదాపు 1.20 లక్షల సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. గుంటూరులో అత్యధిక సీట్లు ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 29,715 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. దీనికి తోడు పలు ప్రైవేటు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కూడా ఈ జిల్లాలో ఉండటం విశేషం. మరోవైపు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అతి తక్కువగా 2,850 ఇంజినీరింగ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Advertisement