LOADING...
AP Genco: ఏపీ జెన్‌కో రికార్డు విద్యుత్‌ ఉత్పత్తి.. గ్రిడ్‌కు 6,009 మెగావాట్లు
ఏపీ జెన్‌కో రికార్డు విద్యుత్‌ ఉత్పత్తి.. గ్రిడ్‌కు 6,009 మెగావాట్లు

AP Genco: ఏపీ జెన్‌కో రికార్డు విద్యుత్‌ ఉత్పత్తి.. గ్రిడ్‌కు 6,009 మెగావాట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
08:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వరంగ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్‌కో శనివారం చరిత్రలోనే అరుదైన రికార్డును నమోదు చేసింది. థర్మల్‌ కేంద్రాలు, జలవిద్యుత్‌ ప్రాజెక్టుల ద్వారా కలిపి గరిష్ఠంగా 6,009 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించి గ్రిడ్‌కు సరఫరా చేసింది. ఇందులో థర్మల్‌ ప్లాంట్ల నుంచి 5,828 మెగావాట్లు, జల విద్యుత్‌ కేంద్రాల నుంచి 181 మెగావాట్లు లభించాయి. ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగడంతో గతంతో పోలిస్తే రోజుకు సుమారు 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్‌ థర్మల్‌ కేంద్రాల ద్వారా గ్రిడ్‌కు చేరుతోందని అధికారులు వెల్లడించారు. నాణ్యమైన బొగ్గు వినియోగమే ఈ స్థాయి ఫలితాలకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు.

వివరాలు 

ఈ ప్లాంట్ల నుంచి 4,000 మెగావాట్ల ఉత్పత్తి సాధించడమే సవాల్

ఏపీ జెన్‌కోతో పాటు ఏపీ విద్యుత్‌ అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌ (ఏపీపీడీసీఎల్‌) ఆధ్వర్యంలో విజయవాడ, కడప,నెల్లూరు జిల్లాల్లో మొత్తం 6,610 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల థర్మల్‌ యూనిట్లు ఉన్నాయి. గతంలో ఈ ప్లాంట్ల నుంచి 4,000 మెగావాట్ల ఉత్పత్తి సాధించడమే సవాల్‌గా ఉండేది. కానీ ప్రస్తుతం వీటి ద్వారా 5,828 మెగావాట్ల విద్యుత్‌ నిరంతరంగా గ్రిడ్‌కు అందుతోంది. మొత్తం స్థాపిత సామర్థ్యంతో పోలిస్తే సగటున 88.79 శాతం ఉత్పత్తి సాధించగలగడం గమనార్హం. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో జల విద్యుత్‌ ఉత్పత్తికి ప్రస్తుతం అవకాశాలు పరిమితంగా ఉన్నాయి.

వివరాలు 

వైకాపా హయాంలో ప్రైవేటీకరణ యత్నాలు 

అయినప్పటికీ మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి 120 మెగావాట్లు, నాగార్జునసాగర్‌ కుడికాలువ పంప్‌ హౌస్‌ ద్వారా 40 మెగావాట్లు, హంపి పవర్‌ హౌస్‌ నుంచి 14 మెగావాట్ల విద్యుత్‌ గ్రిడ్‌కు సరఫరా చేయగలిగారు. వైకాపా ప్రభుత్వ పాలనలో కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్లకు చెందిన మూడు యూనిట్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ యోచనను విరమించుకున్నారు. అదే సమయంలో ప్లాంట్లకు అవసరమైన నాణ్యమైన బొగ్గు సరఫరా సక్రమంగా జరగకపోవడంతో కృష్ణపట్నం కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 45 శాతాన్ని కూడా దాటలేని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

వివరాలు 

5,000 జీసీవీ ఉన్న బొగ్గు కూడా దొరకడం కష్టం

థర్మల్‌ ప్లాంటులోని తొలి రెండు యూనిట్లకు 70 శాతం విదేశీ బొగ్గు (6,000 జీసీవీ - గ్రాస్‌ కెలోరిఫిక్‌ వ్యాల్యూ), 30 శాతం దేశీయ బొగ్గు వినియోగించాల్సి ఉండగా, నాణ్యత లోపించడం ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొగ్గు నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. గతంలో 5,000 జీసీవీ ఉన్న బొగ్గు కూడా దొరకడం కష్టంగా ఉండేది. ప్రస్తుతం ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్‌ నుంచి తీసుకునే 5,800 జీసీవీ బొగ్గు, అలాగే నాణ్యమైన వాష్డ్‌ కోల్‌ వినియోగంతో కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్ల నుంచి గరిష్ఠంగా 2,063 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధ్యమవుతోంది. గతంలో ఈ ఉత్పత్తి స్థాయి 1,200 నుంచి 1,400 మెగావాట్ల మధ్యే పరిమితమై ఉండేది.

Advertisement

వివరాలు 

బహిరంగ మార్కెట్‌ కొనుగోళ్లకు బ్రేక్‌ 

జెన్‌కో థర్మల్‌ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో డిస్కంలకు అదనంగా సుమారు 50 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పీక్‌ డిమాండ్‌ సమయంలోనూ సరిపడా విద్యుత్‌ లభిస్తుండటంతో బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు సుమారు రూ.3,000 కోట్ల విలువైన విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి యూనిట్‌కు గరిష్ఠంగా రూ.10 వరకు చెల్లించాల్సి వచ్చింది.

వివరాలు 

బహిరంగ మార్కెట్‌ కొనుగోళ్లకు బ్రేక్‌ 

అలాగే ముందస్తు ఒప్పందాల ద్వారా యూనిట్‌కు సగటున రూ.15 చొప్పున విద్యుత్‌ను సమకూర్చుకున్నారు. అయితే 2025-26లో డిసెంబరు వరకు మాత్రమే డిస్కంలు రూ.1,700 కోట్లు విద్యుత్‌ కొనుగోలుకు ఖర్చు చేశాయి. మిగిలిన మూడు నెలల్లో డిమాండ్‌ అనూహ్యంగా పెరిగే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ లెక్కన ఈ ఏడాది బహిరంగ మార్కెట్‌ విద్యుత్‌ కొనుగోళ్లు రూ.2,000 కోట్లకు మించబోవని అంచనా వేస్తున్నారు. దీని ఫలితంగా విద్యుత్‌ వినియోగదారులపై పడే ట్రూఅప్‌ భారం తప్పే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement