Andhra Pradesh: ఏపీలో లిథియం బ్యాటరీ క్యాథోడ్ పరిశ్రమ.. రూ.2,081 కోట్ల పెట్టుబడి
ఈ వార్తాకథనం ఏంటి
విద్యుత్ వాహనాలు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కీలకమైన క్యాథోడ్ పదార్థాల ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది. అథా గ్రూప్‌కు చెందిన ఎన్‌పీఎస్‌పీఎల్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పరిశ్రమను తొలుత మహారాష్ట్రలో ఏర్పాటు చేయాలని నిర్ణయించి, అక్కడి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కూడా కుదుర్చుకుంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూల వాతావరణం, అనుమతుల మంజూరులో అమలవుతున్న సింగిల్‌డెస్క్ విధానం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలను పరిశీలించిన అనంతరం సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుని ఏపీలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.
వివరాలు
600 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు
ఈ క్రమంలో కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం పొగురుపల్లె గ్రామంలో పరిశ్రమ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం 130 ఎకరాల భూమిని కేటాయించింది. రూ.2,081 కోట్ల వ్యయంతో ఈ యూనిట్‌ను నిర్మించనుండగా, దీని ద్వారా సుమారు 600 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సంస్థ ప్రతినిధులతో కలిసి శుక్రవారం పొగురుపల్లెలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో విద్యుత్ వాహనాలు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీ రంగానికి మరింత ఊతమివ్వడంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.