
Quantum Valley Declaration: అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ కు ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్"ను ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. జూన్ 30వ తేదీన విజయవాడలో నిర్వహించిన 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్' సందర్భంగా ఈ డిక్లరేషన్‌ను అధికారికంగా ప్రకటించినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు కలసి ఆధునిక క్వాంటమ్ సాంకేతికతను అనుసంధానంగా అభివృద్ధి చేసే దిశగా చర్చలు జరిపినట్టు స్పష్టం చేసింది. అమరావతిని ప్రపంచ స్థాయిలో ఒక క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ డిక్లరేషన్‌ను విడుదల చేసినట్టు పేర్కొంది.
వివరాలు
వచ్చే 12 నెలల్లో అమరావతిలో "క్వూ-చిప్-ఇన్" ఏర్పాటు
ఈ నేపథ్యంలో తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా క్వాంటమ్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణ, ప్రతిభను పెంపొందించడం, మౌలిక సదుపాయాల ఏర్పాటు,అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వ ధ్యాస కేంద్రీకరించనున్నట్టు స్పష్టంచేసింది. ఇక దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ వ్యాలీ బెడ్‌గా భావిస్తున్న "క్వూ-చిప్-ఇన్" ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు, 2035 నాటికి అమరావతిని ప్రపంచ క్వాంటమ్ రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకుంది. ఈ దిశగా మరో కీలక ముందడుగుగా 2026లో ప్రారంభం కానున్న "అమరావతి క్వాంటమ్ అకాడమీ" ద్వారా శిక్షణా కార్యక్రమాలు, ఫెలోషిప్‌లు అందుబాటులోకి తేనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.