AP Govt: రాయలసీమ లిఫ్ట్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డిని ఖండించిన ఏపీ ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే నిలిపివేయించానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ప్రయోజనాల కోసమే పనులు ఆపించామని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని పేర్కొంది. చంద్రబాబును కేంద్రంగా చేసుకుని తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారని పేర్కొంది. సీమకు రోజుకు 3 టీఎంసీల నీరు అందిస్తామంటూ అప్పటి ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ పనులు చేపట్టిందని తెలిపింది.
Details
రేవంత్ రెడ్డి పాత్ర లేదు
జగన్ ప్రభుత్వ ప్రచారంతోనే తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్ ప్రాజెక్టుపై కోర్టుల్లో కేసులు వేసిందని, కేంద్రం, ఎన్‌జీటీతో పాటు పలు సంస్థలకు ఫిర్యాదులు చేసిందని వివరించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం అవసరమైన అనుమతులు లేవన్న కారణంతోనే 2020లో ఎన్‌జీటీ, కేంద్ర ప్రభుత్వం పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం ఈ పనులను నిలిపివేసిందని, దీనికి రేవంత్‌రెడ్డి పాత్ర లేదని పేర్కొంది.
Details
ఏమైందంటే…
శనివారం అసెంబ్లీలో కృష్ణానదీ జలాలపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి, కేసీఆర్ భుజం తట్టి ప్రోత్సహిస్తే.. నేను చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించా. అదీ నా చిత్తశుద్ధి అని ఆయన అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలని అడిగితే, మా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపించారు. నిజంగానే పనులు ఆగాయో లేదో తెలుసుకోవాలంటే నిజనిర్ధారణ కమిటీని పంపించండి అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Details
మొదట తెలంగాణే ఆ తర్వాత పార్టీ
అదే సమయంలో చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన తానే ఆ పార్టీని వదిలి వచ్చానని, అలాంటప్పుడు తెలంగాణకు అన్యాయం చేస్తానా అని ప్రశ్నించారు. మొదట నాకు తెలంగాణ.. ఆ తర్వాతే పార్టీ. తెలంగాణ ప్రజల హక్కులను నాలాంటి వాళ్లు తాకట్టు పెడతారా? రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని చెప్పారు. కేసీఆర్ శాసనసభకు వచ్చి సూచనలు ఇస్తారని భావించామని, తమ ప్రభుత్వం ఆ సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పామని, అందుకే వారి డిమాండ్ మేరకు సమావేశం కూడా ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.