AP Government: ఏపీలో 43 మంది డాక్టర్లకు షాక్.. విధులకు గైర్హాజరుతో శాశ్వత తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఏళ్ల తరబడి ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది ప్రభుత్వ వైద్యులను సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వం నిర్వహించిన సమీక్షలో ఈ 43 మంది వైద్యులు గత నాలుగేళ్లుగా విధులకు హాజరు కావడం లేదని గుర్తించింది. దీనిపై పలుమార్లు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినప్పటికీ, వారు స్పందించలేదు. అంతేకాకుండా, వారిపై అభియోగాలు నమోదు చేసిన తర్వాత కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు మంత్రి తెలిపారు.
వివరాలు
గత నెలలోనూ 51 మంది వైద్యులను తొలగించిన ప్రభుత్వం
ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్-1964 ప్రకారం,ఏ ప్రభుత్వ ఉద్యోగి ఏడాదికిపైగా అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే,అతడిని లేదా ఆమెను సర్వీసుల నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇదే నిబంధనలను అమలు చేస్తూ ఆరోగ్య శాఖ ఈ చర్యలు చేపట్టింది. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో వైద్య శాఖలో ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల్లో ఇది రెండో ప్రధాన నిర్ణయం కావడం గమనార్హం. గత నెలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)పరిధిలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మంది వైద్య సిబ్బందిని శాశ్వతంగా తొలగించింది.
వివరాలు
మరో 118 మంది వైద్యులు అనధికారికంగా గైర్హాజరైనట్లు గుర్తింపు
వీరిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉన్నారు. అలాగే, మరో 34 మంది వైద్యులపై అభియోగాలు నమోదు చేసి నోటీసులు జారీ చేయగా, వారు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. మరోవైపు, మరో ముగ్గురు ప్రొఫెసర్లపై కూడా త్వరలో కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్‌హెచ్)పరిధిలో దాదాపు 118మంది వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నట్లు గుర్తించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వారిపై కూడా దశలవారీగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ వైద్య వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.