Ap Government: ఏపీలో స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్‌లు.. ఈసారి ముందుగానే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు శుభవార్త ప్రకటించింది. వచ్చే విద్యా సంవత్సరంలో అందించబోయే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ విషయంలో ముఖ్యమైన మార్పులను తీసుకుంది. ఈ కిట్‌లో యూనిఫామ్,బెల్టులు,బ్యాగ్‌ల రంగులు ప్రభుత్వం కొత్తగా మార్చింది. ఇక నుంచి ఈ వస్తువులపై రాజకీయ పార్టీల రంగులు లేదా నేతల బొమ్మలు ఉండకుండా ప్రత్యేకంగా రూపొందించారు. బెల్టుల అంచులకు నలుపు రంగు, మధ్యలో తెలుపు రంగు ఉంచుతారు.గతంలో విద్యాకానుక అని రాసిన బెల్టులపై ఈసారి ప్రత్యేక లోగో మాత్రమే ఉంటుంది,ఆ లోగోలో గ్రాడ్యుయేట్ బొమ్మ ఉంటుంది. బ్యాగ్‌లకు లేత ఆకుపచ్చ రంగు ఖరారు చేయగా, యూనిఫామ్ విషయంలో లేత ఆకుపచ్చ, గులాబీ రంగు పెద్ద గడల చొక్కా,లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్ ఉండేలా తీర్చిదిద్దారు.
ఒక్కో కిట్ ఖర్చు రూ. 1858.50
జూన్ 12న పాఠశాలలు తెరుచుకునే రోజుకే ఈ కిట్ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. టెండర్లు పిలవడానికి త్వరలో చర్యలు తీసుకోనున్నారు.కుట్టుకూలి డబ్బుల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు రూ.120,9 నుంచి 10 తరగతుల వారికి రూ.240 చెల్లించనుంది. ఈ విద్యార్థి మిత్ర కిట్‌లో పాఠ్య పుస్తకాలు,నోటు పుస్తకాలు,వర్క్ బుక్స్,డిక్షనరీ, బెల్ట్, షూస్, బ్యాగ్, మూడు జతల యూనిఫామ్లు ఉంటాయి. ఒక్కో కిట్ ఖర్చు రూ. 1858.50 ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అందించిన కిట్‌లలో నాణ్యతపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కచ్చితమైన నాణ్యతతో వస్తువులను అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.