AP Assembly: ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు-2024, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్లు-2024 బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు, శాసనమండలి సమావేశం రేపటికి వాయిదా పడింది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంత్రులు, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాల అమలుకు నిధులు కేటాయించలేదని, కనీస సమాచారం కూడా అందించలేదని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని అడిగితే, లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని, ఆ అప్పులు పథకాల ప్రకటన సమయంలో గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్ల గ్రాంట్
వైసీపీ ఎమ్మెల్సీల ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగున్నర నెలల మాత్రమే అయ్యిందని, ఇలాంటి సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్ల గ్రాంట్‌ను అందిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.