
Smart street Vending Markets: ఎనిమిది నగరాల్లో'స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు.. జూన్‌లో నెల్లూరులోప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో అవసరమైన అన్ని వస్తువులు ఒకేచోట లభిస్తే, వినియోగదారులకు చాలా సౌలభ్యంగా ఉంటుంది.
దీనివల్ల వారు నాలుగైదు చోట్ల తిరగాల్సిన అవసరం ఉండదు. అన్ని వస్తువులను ఒకేచోటే కొనుగోలు చేసి తీసుకెళ్లవచ్చు.
కూటమి ప్రభుత్వం ఇదే లక్ష్యంతో కొత్త ప్రణాళికను అమలు చేయనుంది. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 'స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ల' ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది.
ఈ మార్కెట్లలో ఒకేచోట 200 మంది వ్యాపారాలు చేసుకునేలా అన్ని సౌకర్యాలను అందించనుంది. ఈ విధానంతో వీధి వ్యాపారుల జీవనోపాధి మెరుగుపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను మొదటగా నెల్లూరులో ప్రయోగాత్మకంగా జూన్‌లో ప్రారంభించనున్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
'ప్లగ్ అండ్ ప్లే' విధానం
ప్రత్యేకంగా కంటైనర్లను ఏర్పాటు చేసి, వీటిలో 200 షాపులను నిర్వహించేందుకు వీలుగా చేయనున్నారు.
'ప్లగ్ అండ్ ప్లే' విధానంలో వ్యాపారులు తక్షణమే తమ వ్యాపారాలను ప్రారంభించుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.
కంటైనర్ల పైభాగంలో సోలార్ పలకలను అమర్చి, వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను షాపుల అవసరాలకు వినియోగించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ మార్కెట్లలో నిత్యావసర వస్తువుల నుంచి పండ్లు, కూరగాయలు వరకు అన్ని అందుబాటులో ఉంటాయి.
రెండో దశలో విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి, పిఠాపురం, శ్రీకాకుళం, ఒంగోలులో ఈ మార్కెట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాయలసీమ ప్రాంతంలో కడప, కర్నూలు, అనంతపురం నగరాల్లో ఒక నగరాన్ని త్వరలో ఎంపిక చేసి అక్కడ కూడా ఈ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
2,000 మందికి ఉపాధి కల్పన
ఈ మార్కెట్లు అక్టోబర్ నాటికి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
నగరాల్లోని ప్రధాన కూడళ్లలో వీధి వ్యాపారులు రోడ్లకు ఇరువైపులా తోపుడు బళ్లపై వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే,పోలీసులు, నగరపాలక సంస్థల అధికారులు,రాజకీయ నేతల తదితరుల జోక్యం వల్ల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే,వ్యాపారస్తులు తమ బళ్లను అక్కడి నుంచి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది.
దీనివల్ల వారు ఉపాధిని కోల్పోతున్నారు.వీటిని దృష్టిలో ఉంచుకుని, వీధి వ్యాపారులకు స్థిరమైన వాణిజ్య వేదికగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఎనిమిది మార్కెట్ల ద్వారా 1,600మంది చిరు వ్యాపారులకు ఉపాధి లభించనుంది. అదనంగా, 400 మందికి మార్కెట్ నిర్వహణ, శుభ్రత, భద్రత తదితర పనుల్లో ఉపాధిని కల్పించనున్నారు.
వివరాలు
ఒక్కో మార్కెట్‌కు రూ.7 కోట్ల ఖర్చు
ఒక్కో మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.7 కోట్ల మేర ఖర్చు చేయనుంది.
ఇందులో నగరపాలక సంస్థలు మౌలిక సదుపాయాల కోసం రూ.3 కోట్లు ఖర్చు చేయగా, వ్యాపారులకు శిక్షణ,ఇతర సేవలు అందించేందుకు సెర్ప్ (SERP) రూ.1.25 కోట్లు వెచ్చించనుంది.
వ్యాపారులకు పెట్టుబడి నిధిగా బ్యాంకుల ద్వారా రూ.3 కోట్ల మేర రుణాలు అందించనున్నారు.
మార్కెట్ల నిర్వహణ బాధ్యతను నగరపాలక సంస్థలకే అప్పగించనున్నారు. షాపుల అద్దె, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో ఆయా మార్కెట్ల నిర్వహణ జరగనుంది.