Ntr Bharosa Pensions: కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచంటే..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు పెన్షన్ అమౌంట్ పెంచడం మొదటి చర్యగా చేపట్టింది. ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పెన్షన్లను రూ. 4,000లకు పెంచడం జరిగింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం, 2024 ఏప్రిల్ నాటికి పెన్షన్‌ల బకాయిలు కూడా చెల్లించడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 64,14,174 మంది లబ్ధిదారులు పెన్షన్‌ను పొందుతున్నారు. ఈ పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, తలసేమియా బాధితులు సహా మొత్తం 26 రకాల లబ్ధిదారులకు పెన్షన్ అందుతోంది. ఇదిలా ఉండగా, కొత్తగా పెన్షన్ పొందాలనుకునే వారు దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారు.
నకిలీ ధృవపత్రాలతో పెన్షన్ పొందితే.. చర్యలు
ఈ నేపథ్యంలో తాజాగా కొత్త పెన్షన్ల దరఖాస్తులపై ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడే అవకాశముంది. ఈ విషయమై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. అర్హులైన వారు డిసెంబర్ మొదటి వారం నుంచి తమ దరఖాస్తులను సమర్పించవచ్చునని, దాని కోసం గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి, పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు వెల్లడించనున్నారు. అలాగే, మంత్రి ఆదేశాల ప్రకారం, పెన్షన్‌దారులు ఒకటి రెండు నెలలు గ్రామంలో లేకపోయినా, తరువాత నెలలో వారి పెన్షన్ మొత్తాన్ని కలిపి చెల్లిస్తారు. అనర్హులు, నకిలీ ధృవపత్రాలతో పెన్షన్ పొందడం గుర్తిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.