AP Government: విశ్రాంత ఉద్యోగులకు బకాయిల విడుదల.. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఒక్క రోజులోనే రూ.2,950 కోట్లను విడుదల చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, సెలవుల నగదీకరణ బిల్లుల కోసం ఈ నిధులను కేటాయించి, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.
వివరాలు
రూ.7,059 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు
ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి ఇవ్వడంతో ఈ ప్రక్రియ వేగం అందుకుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఆర్థిక శాఖ, అందుబాటులో ఉన్న నిధుల ఆధారంగా చెల్లింపులను పర్యవేక్షిస్తోంది. మొత్తం మీద రూ.7,059 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఉద్యోగులతో పాటు ప్రభుత్వానికి సరుకులు అందించిన చిన్న కాంట్రాక్టర్లకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటికే రూ.614 కోట్ల బిల్లులను చెల్లించింది.
వివరాలు
పెండింగ్ బకాయిల క్లియర్
ఇటీవలి చెల్లింపులకు ముందుగానే ప్రభుత్వం పలు బకాయిలను కూడా పరిష్కరించింది. ఉద్యోగుల భవిష్య నిధి బకాయిల కింద రూ.1,848 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. అలాగే, సమూహ జీవ భీమా కింద 4,793 మందికి రూ.76 కోట్లు విడుదల చేసింది. పోలీసు శాఖకు సంబంధించిన అదనపు సెలవుల నగదీకరణ కోసం రూ.223 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా గ్రాట్యుటీ బకాయిలుగా రూ.3,411 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల సెలవుల నగదీకరణ కింద రూ.1,800 కోట్లు చెల్లించాల్సి ఉంది.
వివరాలు
పోలీసులకు చెల్లింపులు కొనసాగింపు
ప్రస్తుతం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సంబంధించిన సెలవుల నగదీకరణ బిల్లుల చెల్లింపులు కూడా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వరుసగా బకాయిలను విడుదల చేస్తుండటంతో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించిందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.