LOADING...
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. ప్రతి నెలా 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్' కార్యక్రమం!
ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. ప్రతి నెలా 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్' కార్యక్రమం!

CM Chandrababu: ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. ప్రతి నెలా 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్' కార్యక్రమం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారోగ్యాన్ని మెరుగుపరచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతి నెలా నాలుగో శనివారం 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్‌మెంట్' కార్యక్రమం కింద గ్రామసభలు, హెల్త్ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సంజీవని ప్రాజెక్టుపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం, ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం, నారావారిపల్లెలో విజయవంతంగా అమలవుతున్న ఈ ప్రాజెక్టును జూలై నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని స్పష్టం చేశారు.

వివరాలు

ఏడాదిలోగా 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు

వచ్చే ఏడాదిలోగా 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు లక్ష్యంగా నిర్దేశించారు. వైద్య పరీక్షల ఫలితాలను 48 గంటల్లోనే వాట్సాప్ ద్వారా ప్రజలకు అందించాలని సీఎం సూచించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 904 మొబైల్ మెడికల్ యూనిట్లు అవసరమవుతాయని, దాదాపు రూ.162 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు వివరించగా, సీఎం దీనికి ఆమోదం తెలిపారు. ఇప్పటికే 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ నర్వ్ సెంటర్ డేటాబేస్‌లో నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రతి వ్యక్తికి సంబంధించిన హెల్త్ రికార్డులు నిరంతరం అప్‌డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

వివరాలు

భవిష్యత్తులో వైద్య ఖర్చులు తగ్గించేలా సేవలు

భవిష్యత్తులో వైద్య ఖర్చులు తగ్గించేలా సేవలను రూపొందించాలన్నారు. ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి పెట్టాలని, యోగా, పోషకాహారం, ధ్యానం, ప్రాణాయామం వంటి అలవాట్లు అనుసరించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని పేర్కొన్నారు. అలాగే సంజీవని ప్రాజెక్టు అమలవుతున్న చిత్తూరు జిల్లాలో ప్రజారోగ్యం ఎంతవరకు మెరుగుపడిందో సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.

Advertisement