Andhra Pradesh: వలస కూలీల పిల్లలకు విద్యా భరోసా.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలస జీవనాంతర సమస్యలను తగ్గిస్తూ, కార్మిక కుటుంబాల పిల్లల చదువు నిలిచిపోకుండా చూడాలని లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వలస కూలీల పిల్లల కోసం ఈ ఏడాది మొత్తం 236 సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేశారు. ఈ హాస్టళ్ల ప్రత్యేకత ఏమంటే—రాష్ట్రంలోని పిల్లలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం వచ్చే కార్మికుల పిల్లలకు కూడా వారి తమ మాతృభాషలోనే బోధన అందించే విధానాన్ని అమలు చేస్తున్నారు. సమగ్ర శిక్ష అధికారుల అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 11,842 మంది వలస కార్మికుల పిల్లలున్నారు.
Details
కేంద్ర ప్రభుత్వం 60శాతం నిధులు
వీరి కోసం ఏర్పాటు చేసిన సీజనల్ హాస్టళ్ల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు అందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం కోసం మొత్తం రూ.11.63 కోట్లు మంజూరు చేశారు. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హాస్టళ్లలో ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1000 భోజన వ్యయం కేటాయించబడింది. ప్రతి హాస్టల్‌లో వంటమనిషి, హెల్పర్, టీచర్, కేర్‌టేకర్ వంటి సిబ్బందిని కూడా నియమించారు. ఈపథకం గుంటూరు జిల్లాలో అత్యంత విజయవంతంగా అమలవుతోంది. స్థానిక మిర్చి యార్డుల్లో బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన కూలీల పిల్లలు పెద్దసంఖ్యలో ఉండటంతో, యార్డుల సమీపంలోనే హాస్టళ్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా గుంటూరులో మాత్రమే 1,875 మంది బీహార్ విద్యార్థులు చదువుకుంటున్నారు.
Details
నిరంతరం పర్యవేక్షణ
ఇదే విధంగా కర్నూలులో 4,020, కృష్ణా జిల్లాలో 1,821, ఎన్టీఆర్ జిల్లాలో 1,723 మంది పిల్లలు ఈ సీజనల్ హాస్టళ్లలో నివసిస్తూ తమ విద్యను కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంపై సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వారి మాతృభాష తెలిసిన స్థానికులను వలంటీర్లుగా నియమించి బోధన అందిస్తున్నాం. దీని వల్ల పదేళ్లు దాటిన పిల్లలు కూడా కూలి పనులకు వెళ్లకుండా పాఠశాలకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ హాస్టళ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కూడా చెప్పారు.