LOADING...
New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు .. తొలి ప్రాధాన్యత వారికే!
ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు .. తొలి ప్రాధాన్యత వారికే!

New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు .. తొలి ప్రాధాన్యత వారికే!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో కొత్త పింఛన్ల కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న లక్షలాది మందికి కూటమి ప్రభుత్వం శుభవార్త ఇవ్వబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు వేగవంతం చేసింది. తొలి విడతగా జూన్ 12 నుంచి వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పింఛన్ అందించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి అర్హుల గుర్తింపు, అవసరమైన నిధుల ఏర్పాటుపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అధికారుల అంచనాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా లక్షా యాభై మూడు వేల మంది వితంతువులు పింఛన్‌కు అర్హులు ఉన్నారు. వీరందరికీ పింఛన్లు మంజూరు చేస్తే ప్రభుత్వంపై ప్రతి నెలా అరవై ఒక కోట్లు అదనపు భారం పడనుందని లెక్కలు చెబుతున్నాయి.

వివరాలు 

ఆ తర్వాత దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇచ్చే యోచన

మరోవైపు ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే, వారి భార్యకు వెంటనే పింఛన్ మంజూరు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ విధానంలో ఇప్పటివరకు సుమారు రెండు లక్షల ముప్పై వేల మందికి కొత్తగా పింఛన్లు అందించారు. అయితే అరవై ఏళ్ల లోపు పురుషులకు పింఛన్లు లేకపోవడంతో,భర్తను కోల్పోయిన మహిళలకు వితంతు వర్గంలోనే పింఛన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వితంతు పింఛన్ల ప్రక్రియ పూర్తయ్యాక దివ్యాంగులకు కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దివ్యాంగుల వర్గంలో సుమారు లక్ష మంది కొత్తగా దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం దివ్యాంగుల వర్గంలో ఆరు లక్షల యాభై వేల మంది పింఛన్లు పొందుతుండగా, వారిలో దాదాపు లక్ష మంది అర్హులు కాదని ప్రభుత్వం గుర్తించింది.

వివరాలు 

అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు మంజూరు

ధృవపత్రాల్లో ఉన్న లోపాలను సరిచేసి, అర్హత లేని వారిని తొలగించే ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు,ఒంటరి మహిళలు,ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు సహా మొత్తం ఇరవై ఎనిమిది వర్గాలలో లబ్ధిదారులకు ప్రతి నెలా పింఛన్లు అందిస్తోంది.

Advertisement

వివరాలు 

కొత్త పింఛన్ల కోసం 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా

కొత్త పింఛన్ల కోసం అన్ని వర్గాల్లో కలిపి దాదాపు పది లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం మందికి పింఛన్లు ఇస్తే ప్రతి నెలా నాలుగు వందల కోట్లు,సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు అదనపు వ్యయం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దశలవారీగా అర్హులైన వారికి పింఛన్లు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement