LOADING...
Bharath Net: భారత్‌నెట్‌తో ఏపీ ఒప్పందం.. గ్రామాలకు ఫైబర్ ఇంటర్నెట్‌కు శ్రీకారం
భారత్‌నెట్‌తో ఏపీ ఒప్పందం.. గ్రామాలకు ఫైబర్ ఇంటర్నెట్‌కు శ్రీకారం

Bharath Net: భారత్‌నెట్‌తో ఏపీ ఒప్పందం.. గ్రామాలకు ఫైబర్ ఇంటర్నెట్‌కు శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌నెట్‌ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో భారత్‌నెట్‌ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్‌ ఆధారిత ఇంటర్నెట్ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో భారత్‌నెట్‌ ప్రాజెక్టును అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణకు భారత్‌నెట్‌ పూర్తి స్థాయిలో సహకారం అందించనుంది.

వివరాలు 

ఈ ప్రాజెక్టు అమలుకు రూ.2,432 కోట్లు 

దేశవ్యాప్తంగా సుమారు ఐదు లక్షల గ్రామాల్లోని గృహాలకు ఫైబర్ కనెక్షన్లు అందించడమే భారత్‌నెట్‌ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టు అమలుకు రూ.2,432 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది. ప్రాజెక్టు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏపిబీఐఎల్‌ అనే పేరుతో ప్రత్యేక ఉద్దేశ్య వాహక సంస్థ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి నుంచి, రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో అవసరమైన నిధులను విడుదల చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలోని 13,426 గ్రామ పంచాయతీలలో ఈ ప్రాజెక్టును అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటి దశలో 1,692 పంచాయతీల్లో నెట్‌వర్క్‌ను ఆధునీకరించనుండగా,రెండో దశలో 11,254 గ్రామాల్లో కనెక్టివిటీ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.

Advertisement