LOADING...
Ashwini Vaishnav: కడప-బెంగళూరు రైల్వే మార్గానికి ఏపీ ప్రభుత్వం ఇంకా రూ.1,163 కోట్లు చెల్లించాల్సి ఉంది: అశ్వినీ వైష్ణవ్‌
కడప-బెంగళూరు రైల్వే మార్గానికి ఏపీ ప్రభుత్వం ఇంకా రూ.1,163 కోట్లు చెల్లించాల్సి ఉంది: అశ్వినీ వైష్ణవ్‌

Ashwini Vaishnav: కడప-బెంగళూరు రైల్వే మార్గానికి ఏపీ ప్రభుత్వం ఇంకా రూ.1,163 కోట్లు చెల్లించాల్సి ఉంది: అశ్వినీ వైష్ణవ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

266 కిలోమీటర్ల పొడవున్న కడప-బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం తన వాటా కింద ఇంకా రూ.1,163 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మొత్తం రూ.2,706 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఖర్చును కేంద్రం, రాష్ట్రం సమానంగా భాగస్వామ్యం చేసుకునేలా ఒప్పందం జరిగింది. 2024 మార్చి నెల వరకు ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.358 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతానికి కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కిలోమీటర్ల రైల్వే మార్గం మాత్రమే ప్రారంభమైంది.

వివరాలు 

రూ.190 కోట్లు మాత్రమే జమ

మొత్తంగా ఏపీ ప్రభుత్వం రూ.1,353 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం రూ.190 కోట్లు మాత్రమే జమచేసింది. ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు మిగిలిన నిధులు రాష్ట్రం అందించాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. 2021 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎలైన్‌మెంట్‌ను ప్రతిపాదించగా, ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-శ్రీ సత్యసాయి ప్రశాంతినిలయం మార్గంగా ఉన్న 105 కిలోమీటర్ల దూరాన్ని కలిగిన ఆ మార్గానికి సర్వే చేయాలని అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ వివరాలను బుధవారం లోక్‌సభలో తెలుగుదేశం ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి వెల్లడించారు.

వివరాలు 

2024-25 సంవత్సరానికి  రైతులకు బకాయిలు సుమారు రూ.28 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏడాది చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతున్నట్లు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి నిమూబెన్ జయంతిభాయ్ బాంభానియా తెలిపారు. లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు బైరెడ్డి శబరి, కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. గత ఐదేళ్లలో చెరకు సాగు విస్తీర్ణం ఏకంగా 72 శాతం తగ్గినప్పటికీ దిగుబడి పరిమాణం మాత్రం స్థిరంగా కొనసాగిందని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిట్టుబాటు ధరను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అనుసరిస్తున్నామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి స్టేట్ అడ్వైజ్డ్ ప్రైస్ (SAP) అమలు చేయడం లేదని చెప్పారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.28 కోట్లు ఉన్నాయని మంత్రి వివరించారు.

వివరాలు 

గత ఐదేళ్లలో ఏపీలో 1,056 పాఠశాలలు మూత 

రాజ్యసభలో బుధవారం కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి జయంత్ చౌధరి వెల్లడించిన సమాచారం ప్రకారం, 2019-20 నుండి 2023-24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 1,056 పాఠశాలలు మూతపడ్డాయి. అందులో ప్రభుత్వ పాఠశాలలు 115 కాగా, ప్రైవేట్ స్కూళ్లు 941 ఉన్నాయి. 2019-20లో రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 16,173గా ఉండగా, 2023-24 నాటికి అది 15,232కి తగ్గింది. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,115 నుంచి 45,000కి తగ్గినట్లు మంత్రి తెలిపారు. పలువురు రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాచారం ఇచ్చారు.