LOADING...
Vasamsetti Subhash: కార్మికుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేబర్ అడ్డాల ఏర్పాటు
కార్మికుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేబర్ అడ్డాల ఏర్పాటు

Vasamsetti Subhash: కార్మికుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేబర్ అడ్డాల ఏర్పాటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 12, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లోని కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ప్రత్యేకంగా "లేబర్ అడ్డాలు" ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. కార్మికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఒకేచోట అందుబాటులో ఉండేలా ఆధునిక వసతులతో ఈ లేబర్ అడ్డాలను రూపొందిస్తున్నామని చెప్పారు. మొదటి దశలో పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా 25 లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఈ కేంద్రాలను ప్రతి నియోజకవర్గానికి విస్తరించే ప్రణాళిక ఉందన్నారు. కార్మికులకు నీడ, తాగునీరు, వాష్‌రూమ్‌లు వంటి ప్రాథమిక సౌకర్యాలతో పాటు నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

వివరాలు

సాంకేతిక పరికరాల వినియోగంపై ప్రత్యేక శిక్షణ

ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగంపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక రోజు పని దొరకని కార్మికులను పెద్ద నిర్మాణ ప్రాజెక్టులు, నైపుణ్యాధారిత ఉపాధి కేంద్రాలకు తీసుకెళ్లి వారికి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. దీంతో కార్మికులకు స్థిరమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు అన్నా క్యాంటీన్లతో లేబర్ అడ్డాలను అనుసంధానం చేసి కార్మికులకు తక్కువ ధరలో ఆహారం అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

వివరాలు

లేబర్ అడ్డాలను నోడల్ పాయింట్లుగా మార్చే ప్రణాళిక

అలాగే ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసి లేబర్ అడ్డాలను నోడల్ పాయింట్లుగా మార్చే ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారికి ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు.

Advertisement