AP Government : ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. వారిపై కేసులు పెట్టేవారికి రక్షణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై తీసుకున్న తాజా నిర్ణయం ప్రభుత్వ రంగంలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, కేసులు పెట్టే వారికి రక్షణ కల్పించే చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ విధులకు విఘాతం కలిగించే లంచగొండితనంపై నిరసన వ్యక్తం చేసే వారికి రక్షణగా ఏడీజీపీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించారు. నోడల్ అధికారిగా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇంటెలిజెన్స్) మహేష్ చంద్ర లడ్డాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
విజిలెన్స్ కమిషన్ చర్యలు
ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ కమిషన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, రాష్ట్రంలోని అవినీతి సంబంధిత కేసులను వెలుగులోకి తీసుకొస్తున్న వారికి భద్రత కల్పించడంలో కీలకమైంది. విజిలెన్స్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను నోడల్ అధికారిగా నియమిస్తూ సూచనలు ఇచ్చారు. ఈ చర్య ద్వారా అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే ప్రభుత్వ సంస్థలపై నిఘా పెరుగుతుంది. ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్‌లు, సొసైటీలు, లేదా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థలపై ఫిర్యాదులు చేసే వారికి ఈ రక్షణ కవర్ను అందజేస్తారు.
పెన్షన్ డబ్బులతో పరారైన అధికారి
ఇక గురజాల మండలం తేలుకుట్ల గ్రామ సచివాలయంలో వ్యవసాయ సహాయకునిగా పని చేస్తున్న బత్తుల వెంకట నారాయణ సామాజిక పింఛన్ల పంపిణీకి సంబంధించి రూ.2.30 లక్షల నగదుతో పరారయ్యారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు స్పందించి, వెంకట నారాయణను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. క్రమశిక్షణ చర్యల పరంగా, సస్పెన్షన్ అమలులో ఉండగా ఆయన జిల్లా కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదని ఆదేశించారు.