AP Government: అరుదైన వ్యాధుల చికిత్సకు ఏపీ ప్రత్యేక పాలసీ.. రిఫరల్ కేంద్రాల ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది. రేర్ డిసీజెస్ బాధితులకు వ్యాధి నిర్ధారణ కోసం ఉచిత పరీక్షలు,అవసరమైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో మూడు రిఫరల్ కేంద్రాలు, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే, అరుదైన వ్యాధులపై సమగ్ర సమాచారాన్ని నమోదు చేసేలా ప్రత్యేక రిజిస్ట్రీని ఏర్పాటు చేయనుంది.
వివరాలు
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు
రేర్ డిసీజెస్ గుర్తింపు, చికిత్స, నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వైద్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్-2021' మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ప్రత్యేక విధానం రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.