AP Social Media Campaign: గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో.. సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ వినూత్న క్యాంపెయిన్
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియాపై కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
"సోషల్ మీడియాను మంచికి వాడుదాం" అనే సందేశంతో ప్రజలలో చైతన్యం రేకెత్తించేలా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి, నెటిజన్లకు పిలుపునిస్తోంది.
సినీ ప్రముఖులు కూడా ఇందులో భాగస్వామ్యం అవుతూ, "సోషల్ మీడియాను మంచికోసమే ఉపయోగించుకోవాలి, తప్పుడు ప్రచారంతో ద్వేషం ప్రదర్శించరాదు" అని కోరుతున్నారు.
ఈ ప్రచారంలో ఫేక్ న్యూస్, విద్వేషం, విషపూరిత రాతల ప్రచారాన్ని మానుకోవాలని, చెడు పోస్టులు చేయరాదని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజలు, నెటిజన్లు మంచి దిశగా ఆలోచించి, సోషల్ మీడియాను ఉపయోగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వివిధ నగరాల్లో భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
వివరాలు
మేక్ సోషల్ మీడియా ఎ పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్
ఆటోలపై పోస్టర్లు అతికించి ప్రచారాన్ని విస్తరించింది. గాంధీజీ "చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు" సూక్తిని ఆధారంగా తీసుకుని, నాలుగో కోతి కాన్సెప్ట్‌ను జోడించి "చెడు పోస్టులు వద్దు" అనే సందేశంతో ఆసక్తికర హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది.
ప్రధాన కూడళ్లలో "మేక్ సోషల్ మీడియా ఎ పాజిటివ్ ఎక్స్‌పీరియన్స్"అనే పేరుతో పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటుచేసింది.
ఈ సందేశం విజయవాడ,తాడేపల్లి హైవే, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రదర్శించింది.
ప్రభుత్వం ఫేక్ న్యూస్, వ్యక్తిత్వ హననంపై కఠినంగా వ్యవహరిస్తూ, ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది.
ఈ ప్రచారానికి ప్రముఖ సినీ తారలు శ్రీలీల, అడవి శేషు, అఖిల్ వంటి వారు కూడా మద్దతు తెలిపారు.
వివరాలు
ఫేక్ న్యూస్, చెడు కామెంట్లతో ఇతరులను బాధపెట్టవద్దు
హీరోయిన్ శ్రీలీల తన వీడియోలో "లైక్స్,వ్యూస్ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. సామాజిక బాధ్యత తీసుకోండి,అసత్య ప్రచారాలకు దూరంగా ఉండండి" అంటూ ప్రజలకు సూచించింది.
నిఖిల్ తన సందేశంలో"సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేసే ముందు అది నిజమో కాదో ఒకసారి తనిఖీ చేయండి. ఫేక్ న్యూస్ కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది.సోషల్ మీడియాను మంచికోసమే వాడండి" అని చెప్పాడు.
అడవి శేషు తన వీడియోలో "ఫేక్ న్యూస్, చెడు కామెంట్లతో ఇతరులను బాధపెట్టవద్దు. బాధ్యతాయుతంగా వ్యవహరించండి" అని సూచించాడు.
ఇక జనసేన పార్టీ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈ మొత్తం ప్రచారం సోషల్ మీడియాను సమాజానికి మంచిగా ఉపయోగించుకునే వేదికగా మార్చడమే లక్ష్యంగా కొనసాగుతోంది.