Andhra : హోర్డింగులపై డిస్‌ప్లే డివైజెస్ ఫీజు.. విధాన సవరణలతో త్వరలో మార్గదర్శకాలు
ఈ వార్తాకథనం ఏంటి
పట్టణాల్లోని ప్రధాన జంక్షన్లు, బిజీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా హోర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టే రోజులకి ఇక తెరపడుతోంది. ఇక నుంచి తప్పనిసరిగా సంబంధిత పట్టణ స్థానిక సంస్థల నుంచి లైసెన్సులు తీసుకుని, నిర్ణయించిన ఫీజులు చెల్లించినప్పుడే ప్రచార బోర్డులు ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ఈ విషయంపై అడ్వర్టైజ్‌మెంట్ పాలసీలో మార్పులు చేసి, కొత్త మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందుకోసం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్గ ఆమోదానికి ప్రతిపాదనలు పంపుతోంది. ఇటీవల హైకోర్టు, నగరాలు-పట్టణాల్లో నియమాలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్న హోర్డింగులు, ఫ్లెక్సీలపై గట్టిగా అభ్యంతరం తెలిపింది. అక్రమంగా ఉన్నవాటిపై తీసుకున్న చర్యలు ఏమిటో నివేదించాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ రంగంలో సవరణలు చేపడుతోంది.
వివరాలు
ప్రకటనల పన్ను స్థానంలో'డిస్‌ప్లే డివైజెస్ ఫీజు'
జీఎస్‌టీ అమలు తర్వాత ప్రకటనల పన్ను వసూళ్ల విషయంలో అనేక చోట్ల మొరాయింపు వచ్చింది. జీఎస్‌టీ చెల్లించిన తర్వాత మళ్లీ స్థానిక సంస్థలు పన్ను కోరడం సరైందా? అంటూ పలు యాడ్ ఏజెన్సీలు కోర్టు తలుపుతట్టాయి. ఈ పరిస్థితిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన పాలసీ తీసుకురావాలనే ఉద్దేశంతో మార్పులు చేస్తున్నారు. ప్రకటనల పన్ను స్థానంలో'డిస్‌ప్లే డివైజెస్ ఫీజు'అనే కొత్త అంశాన్ని చేరుస్తున్నారు. దీంతో జీఎస్‌టీ చెల్లించిన వాళ్లకు మరోసారి'పన్ను'అనే అనుమానం రావని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. హోర్డింగులు పెట్టే ప్రైవేట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు తప్పనిసరిగా పట్టణ స్థానిక సంస్థల నుంచి లైసెన్సు పొందాలి. ప్రతి మూడేళ్లకు లైసెన్సు పునరుద్ధరణ తప్పనిసరి. లైసెన్సు ఉన్న ఏజెన్సీల ద్వారానే హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
వివరాలు
అంతరాయం లేని ప్రాంతాల్లో మాత్రమే బోర్డులు
బోర్డుల పరిమాణం.. పొడవు, వెడల్పు.. ఆధారంగా వసూలు చేసే రుసుములు కూడా పెంచనున్నారు. ఈ కొత్త విధానంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో హోర్డింగుల ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ.100-150 కోట్లైతే, ఇది రూ.200 కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా. వ్యక్తిగతంగా హోర్డింగులు లేదా ఫ్లెక్సీలు పెట్టాలనుకునేవారికి కూడా నిర్ణయించిన ఫీజులు తీసుకుని తాత్కాలిక అనుమతులు ఇవ్వనున్నారు. అనుమతి లేకుండా పెట్టే బోర్డులను నియంత్రించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయబోతున్నారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ప్రాంతాల్లో, ప్రమాదం ఉన్న చోట్ల హోర్డింగులు పెడితే వాటిని గుర్తించి తొలగిస్తారు. నిర్బంధం లేని, అంతరాయం లేని ప్రాంతాల్లో మాత్రమే బోర్డులు ఏర్పాటుకు అనుమతి ఉంటుంది.