Page Loader
Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు .. బాధ్యులపై పీడీ యాక్టు ప్రయోగం
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మనోహర్

Nadendla Manohar: బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు .. బాధ్యులపై పీడీ యాక్టు ప్రయోగం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 06, 2024
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో రేషన్‌ బియ్యం అక్రమంగా తరలింపు సమస్యపై, కాకినాడ కేంద్రంగా జరిగిన ఘటనలు, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులపై సీబీసీఐడీతో విచారణ చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. అక్రమాలను అడ్డుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని,ఈ వ్యవహారంపై సీఎం ఇప్పటికే విచారణ జరిపినట్లు ఆయన తెలిపారు. గురువారం ఉదయం విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, డీసీఏసోలు, పౌరసరఫరాల సంస్థ మేనేజర్లు, తూనికలు, కొలతల శాఖ అధికారులు కలిసి నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.

వివరాలు 

 62,000 టన్నుల బియ్యం అక్రమంగా  తరలింపు 

ఇప్పటికే 1,066 కేసులు నమోదు చేసామని, 729 మందిని అరెస్టు చేసి, 102 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. రాష్ట్రం నుండి 62,000 టన్నుల బియ్యం అక్రమంగా తరలింపయ్యాయని, వాటి విలువ సుమారు రూ. 240 కోట్లు అవుతోందని ఆయన వెల్లడించారు. విశాఖ, కృష్ణపట్నం పోర్టుల కంటే కాకినాడ పోర్టు నుండి ఎక్కువ మొత్తంలో బియ్యం అక్రమంగా తరలిపోవడంతో కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. బియ్యం అక్రమ రవాణా మానిటరింగ్‌ కోసం స్టెల్లా షిప్‌లో అన్ని విభాగాలను కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమీక్ష జరిపినట్లు తెలిపారు. అక్రమ రవాణా చేసే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని, చట్టాన్ని కూడా సవరిస్తామని పేర్కొన్నారు.

వివరాలు 

స్మగ్లింగ్‌ డెన్‌గా పోర్టు

గత జూన్‌ నెలలో కాకినాడలో 28 గోదాములపై దాడులు జరిపి, 51 లక్షల టన్నుల రేషన్‌ బియ్యం పట్టుబడిన విషయం మనోహర్‌ గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రత్యేక దృష్టి సారించడంతో కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా స్పష్టమైందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఈ పోర్టు స్మగ్లింగ్‌ డెన్‌గా మారిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ వీరపాండియన్, సంస్థ ఎండీ మంజిర్‌ జిలానీ, విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జేసీ మయూర్‌ అశోక్‌ పాల్గొన్నారు.