Free Bus Scheme: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు.. రోజుకు రూ.6కోట్ల వరకు రాబడి కోల్పోనున్న ఆర్టీసీ
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ అవసరాలను తీర్చేందుకు అదనంగా 2 వేల బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరమని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఎంత ఆదాయం తగ్గుతుందో, ఏయే బస్సులకు డిమాండ్ పెరుగుతుందో తెలియజేసే ప్రాథమిక నివేదికను ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ పథకంపై అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాల్లో అమలు చేయబడిన ఉచిత బస్ ప్రయాణ పథకాలను పరిశీలించి నివేదికపై చర్చించనుంది.
ఆర్టీసీలో సగటున రోజుకు 44 లక్షల మంది ప్రయాణం
ప్రస్తుతం ఆర్టీసీలో సగటున రోజుకు 44 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వీరిలో 27 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేస్తారు. వీరిలో సూపర్‌లగ్జరీ, అల్ట్రాడీలక్స్, ఏసీ సర్వీసుల్లో ప్రయాణించేవారు సుమారు 3 లక్షల మంది కాగా, మిగిలిన 24 లక్షల మంది పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు, నగర ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఈ సర్వీసుల్లో రోజుకు 10 లక్షల మంది ప్రయాణికులు పెరగవచ్చని అంచనా.