
Smart street Vending Markets:ఏపీ ప్రభుత్వం అనుమతితో ఏడు నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటుకు రంగం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, వీధి వ్యాపారులకు ప్రత్యక్ష లాభాలు చేకూరనుండటంతో వారు ఆర్థికంగా మరింత స్థిరంగా మారే అవకాశం ఉంది. ఇటీవల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మైపాడు రోడ్డులో ప్రయోగాత్మకంగా ఒక స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో, ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో తాజాగా అధికారికంగా అనుమతులు జారీ చేసింది.
వివరాలు
మున్సిపాలిటీలు, బ్యాంకుల సమన్వయంతో లబ్ధిదారులకు రుణాలు
మెప్మా (MEPMA) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఏడు పట్టణాల్లో ఈ మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో అనంతపురం, కర్నూలు, తాడేపల్లి-మంగళగిరి, ఒంగోలు, శ్రీకాకుళం, విజయవాడ, వైయస్సార్ కడప మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సంబంధిత మున్సిపాలిటీలు, బ్యాంకుల సమన్వయంతో లబ్ధిదారులకు రుణాలు సమకూర్చనున్నారు. గరిష్ఠంగా 200 వరకు దుకాణాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వీటిని ప్రధానంగా పొదుపు సంఘాల మహిళలకు కేటాయించి, వారి ఉపాధికి మరింత బలమివ్వనున్నారు.