Rajahmundry Paper Mills: రాజమహేంద్రవరం పేపర్ మిల్స్‌కు పీఎఫ్ మినహాయింపు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్‌కు గతంలో కల్పించిన ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కార్మికశాఖ కార్యదర్శి శేషగిరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈపీఎఫ్, ఎంపీ చట్టం-1952లోని సెక్షన్ 17(4) కింద సంస్థకు గతంలో పీఎఫ్ మినహాయింపు మంజూరు చేశారు. అయితే, ఆ మినహాయింపుకు సంబంధించిన నిబంధనలను సంస్థ ఉల్లంఘించినట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు.
వివరాలు
నిబంధనల ఉల్లంఘనతో పాటు షోకాజ్ నోటీసుకు స్పందించకపోవడంతో..
ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 30న సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసి, 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఇప్పటి వరకు సంస్థ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనల ఉల్లంఘనతో పాటు షోకాజ్ నోటీసుకు స్పందించకపోవడంతో, గతంలో ఇచ్చిన పీఎఫ్ మినహాయింపును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించింది. సెక్షన్ 17(4) కింద మినహాయింపు పొందిన సంస్థలకు ఉద్యోగుల పీఎఫ్ వాటాతో పాటు యాజమాన్య వాటాను కలిపి సొంత అంతర్గత పీఎఫ్ ట్రస్టును నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్‌కు ఆ వెసులుబాటు ఇకపై ఉండదని స్పష్టమైంది.