
Google AI Hub: విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్.. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి కొత్త దిశ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్లే మరో మైలురాయిగా గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయబోతున్న ఏఐ హబ్, డేటా సెంటర్ నిలవనున్నాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో సాంకేతిక అభివృద్ధికి వేగం తెచ్చే గేమ్ ఛేంజర్‌లుగా భావిస్తున్నారు. గూగుల్ విశాఖలో కేవలం డేటా నిల్వ కేంద్రం మాత్రమే కాదు, కృత్రిమ మేధ ఆధారిత (ఏఐ) అప్లికేషన్ల ప్రాసెసింగ్‌కి అవసరమైన అధునాతన కంప్యూటింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనుంది. దీని ఫలితంగా అనేక ఏఐ ఆధారిత కంపెనీలు ఈ హబ్‌కు అనుబంధంగా పనిచేసే అవకాశం ఉంది.
వివరాలు
ఏఐ హబ్‌లో ప్రధానంగా ఏమి జరుగుతుంది?
ఈ కేంద్రంలో భారీ స్థాయి డేటా నిల్వ, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ కార్యకలాపాలు జరుగుతాయి. సాధారణ కంప్యూటర్లలో సీపీయూలను వాడితే, డేటా సెంటర్లలో మాత్రం జీపీయూలు (Graphics Processing Units), టీపీయూలు (Tensor Processing Units), ఎన్‌వీఎంఈ (Non-Volatile Memory Express) స్టోరేజ్ వంటి అత్యాధునిక పరికరాలు ఉపయోగిస్తారు. ఒక్క జీపీయూ వేల సంఖ్యలో సీపీయూల పనిని నిర్వహించగలదని, అందువల్ల అనేక అప్లికేషన్లను ఒకేసారి నడపడం సాధ్యమవుతుంది. గూగుల్ ఈ విశాఖ డేటా సెంటర్‌ను తన సెర్చ్,ఆండ్రాయిడ్, గూగుల్ ప్లే, క్రోమ్, యూట్యూబ్, మ్యాప్స్, వర్క్‌స్పేస్, గూగుల్ క్లౌడ్, గూగుల్ ఎర్త్, జెమినీ ఏఐ వంటి సేవల నిర్వహణకు వినియోగించనుంది. అలాగే దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు కూడా డేటా స్టోరేజ్, కంప్యూటింగ్ సేవలు అందించబోతుంది.
వివరాలు
ఎందుకు గేమ్ ఛేంజర్?
గూగుల్ ఈ ప్రాజెక్టుపై ఐదేళ్లలో సుమారు రూ.1.33 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు అంచనా. ఇది విశాఖలో ఐటీ రంగ అభివృద్ధికి సువర్ణాధ్యాయంగా నిలుస్తుంది. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో తమ అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పిన తర్వాత ఆ నగరం ఐటీ రంగంలో అగ్రస్థానానికి చేరినట్టు, విశాఖ కూడా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు సమానంగా ఎదగగల సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో విశాఖపై అంతర్జాతీయ దృష్టి పడింది. పెట్టుబడుల కోసం ఐటీతోపాటు ఇతర పరిశ్రమల ప్రముఖులు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. నవంబర్‌లో జరగనున్న రాష్ట్ర పెట్టుబడిదారుల సదస్సు ముందు ఈ ఒప్పందం కుదరడం విశేషం. గూగుల్ ప్రాజెక్టు ద్వారా విశాఖ గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా మారబోతోంది.
వివరాలు
విద్యుత్ వినియోగం ఆధారిత సామర్థ్యం
సముద్ర గర్భంలో ఉన్న కేబుల్ నెట్‌వర్క్ ద్వారా ఇక్కడి నుంచి 12 దేశాలతో గూగుల్ నేరుగా అనుసంధానమవుతుంది. జెమినీ ఏఐతోపాటు గూగుల్ ఇతర సేవలు కూడా ఈ కేంద్రం ద్వారా అందుబాటులోకి వస్తాయి. డేటా సెంటర్ల సామర్థ్యాన్ని సాధారణంగా విద్యుత్ వినియోగం ఆధారంగా కొలుస్తారు. సాధారణ కంప్యూటర్లు 100-200 వాట్లు వినియోగిస్తే, జీపీయూలు ఉపయోగించే సిస్టమ్‌లు 300-400 వాట్లు అవసరమవుతాయి. వేల సంఖ్యలో జీపీయూలు పనిచేసే ఈ సెంటర్‌లో భారీ విద్యుత్ వినియోగం అవసరం అవుతుంది.
వివరాలు
నిపుణులకు విస్తృత అవకాశాలు
విశాఖలో స్థాపించబడుతున్న ఈ కేంద్రం ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారవుతారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మాత్రమే కాకుండా, ఏఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ, డేటా సెంటర్ టెక్నాలజీ రంగాల్లో నిపుణులకు విస్తృత అవకాశాలు లభిస్తాయి. సర్వర్ ఇన్‌స్టలేషన్, నెట్‌వర్క్ పరికరాల నిర్వహణ, స్టోరేజ్ సిస్టమ్ నిర్వహణ, ట్రబుల్ షూటింగ్ వంటి విభాగాల్లో రోజుకు 24 గంటలు పనిచేసే నిపుణ బృందాలు అవసరం అవుతాయి.