ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం... ఏకకాలంలో 56,829 మంది టీచర్ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్న బదిలీ ప్రక్రియకు ముహుర్తం ఆసన్నమైంది. ఈ మేరకు భారీగా టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలైంది. సుమారు 56,829 మంది ఉపాధ్యాయులను ఏకకాలంలో బదిలీ చేస్తూ ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ సజావుగా సాగేందుకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో బదిలీలను ప్రారంభించింది. అయితే ఉద్యోగుల సీనియారిటీ, మెరిట్ లిస్ట్ ఆధారంగానే బదిలీల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లోనూ ఈ బదిలీ ప్రక్రియను విద్యాశాఖ మొదలుపెట్టింది.
వారే బదిలీలకు అర్హులు: ప్రభుత్వం
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ఏపీ సర్కార్ గతంలో ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. అయితే బదిలీలకు సంబంధించిన గైడ్ లైన్స్ ని తెలుపుతూ జీవో నెంబర్ 47 జారీ చేసింది. ఈ నెల 31 నాటికి అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు బదిలీలు నిర్వహిస్తామని ఇటీవలే ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన, పరిపాలన కారణాలతో బదిలీలకు ప్రభుత్వం తెరలేపింది. 2023 ఏప్రిల్ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ట్రాన్స్ ఫర్లకు అర్హులుగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
బదిలీ తర్వాతా అదే విభాగంలో కొనసాగేలా మార్గదర్శకాలు
మే 31, 2025 లేదా అంతకంటే ముందే పదవి విరమణ చేసే వారికి బదిలీలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం చెప్పింది. 2022-23 అకాడమిక్ ఇయర్ నాటికి ఒకే చోట 5 ఏళ్ల సర్వీస్ కాలాన్ని పూర్తి చేసిన గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులు, 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఇతర ఉపాధ్యాయులకు తప్పకుండా స్థానచలనం కలగనుంది. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ సర్వీసులో కొనసాగుతున్నారో, బదిలీ తర్వాత అదే విభాగంలో కొనసాగేలా మార్గదర్శకాల్లో స్పష్టంగా చెప్పారు. టీచర్ల బదిలీలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇందుకు వెబ్ కౌన్సెలింగ్ సైతం చేపడుతున్నట్లు సమాచారం.