LOADING...
Amaravati: అమరావతిలో 58 అడుగుల ఎత్తుతో పొట్టి శ్రీరాములు విగ్రహం.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

Amaravati: అమరావతిలో 58 అడుగుల ఎత్తుతో పొట్టి శ్రీరాములు విగ్రహం.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అమరజీవి పొట్టి శ్రీరాములు ఏ ఒక్క కులానికి పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన సమస్త తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు జాతి ప్రత్యేక గుర్తింపుకోసం అహర్నిశలు పోరాడి, తన ప్రాణాలనే అర్పించిన అరుదైన నాయకుడు పొట్టి శ్రీరాములేనని ఆయన కొనియాడారు. ఆయన చేసిన త్యాగం భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్న సంకల్పంతో తాను, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ కలిసి ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఆమరణ నిరాహార దీక్షగా 58 రోజుల పాటు ఉపవాసం చేసి ప్రాణత్యాగం చేసిన ఘట్టాన్ని చిరస్థాయిగా నిలిపేందుకు రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

వివరాలు 

స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్

దీనికి 'స్టాచ్యూ ఆఫ్‌ శాక్రిఫైజ్‌' అనే పేరు పెట్టనున్నట్టు తెలిపారు. అలాగే 6.8 ఎకరాల విస్తీర్ణంలో మెమోరియల్‌ పార్కును అభివృద్ధి చేసి, దానికి 'పొట్టి శ్రీరాములు స్మృతివనం'గా నామకరణం చేసినట్టు వివరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన 'శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం' కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాములు జీవితం, పోరాటాలను ప్రతిబింబించే ఫొటో గ్యాలరీని సందర్శించారు. అమరజీవి కుటుంబ సభ్యులు గునుపూడి హనుమంతరావు, సత్యనారాయణరావు, నరసింహారావు, సుబ్రహ్మణ్యం, కుందా ప్రతిభలను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఆ తరువాత చంద్రబాబు సభను ఉద్దేశించి మాట్లాడారు.

వివరాలు 

పొట్టి శ్రీరాములును గౌరవించింది టీడీపీనే 

పొట్టి శ్రీరాములుకు తొలిసారిగా అధికారిక గుర్తింపు కల్పించిన పార్టీ తెలుగుదేశమేనని చంద్రబాబు గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ నేతృత్వంలో 1985లో తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే నెల్లూరు జిల్లాకు శ్రీపొట్టి శ్రీరాములు పేరును ప్రతిపాదిస్తూ 2003 మార్చి 10న కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనను 2008లో కేంద్రం నోటిఫై చేసినట్టు తెలిపారు. నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు జన్మించిన ఇంటిని మెమోరియల్‌గా అభివృద్ధి చేసి, అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆయన ప్రారంభించిన ఆసుపత్రిని ఆధునీకరించి, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఆయన ప్రాణాలు విడిచిన చెన్నైలోని భవనాన్ని 'త్యాగ భవనం'గా గుర్తించి, సంరక్షణ చేపడతామని వెల్లడించారు.

Advertisement

వివరాలు 

ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలో ఎదగాలి

ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్టు చంద్రబాబు తెలిపారు. అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామాన్ని 'వాసవీ పెనుగొండ'గా మార్చామని చెప్పారు. అక్కడ విశాలమైన ఆలయాన్ని నిర్మించి, దాన్ని దివ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. గుప్తా, శెట్టి, వైశ్య, కోమటి వంటి వేర్వేరు పేర్లతో కాకుండా, అందరికీ 'ఆర్యవైశ్యులు' అనే పేరుతోనే కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా త్వరలో చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులు దానశీలతలో ముందుంటారని ప్రశంసించారు. వారు ఆంత్రప్రెన్యూర్లుగా ఎదగాలని, ముఖ్యంగా మహిళలు ప్రభుత్వ, కార్పొరేషన్‌ రుణాలు పొందేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

వివరాలు 

మార్చి 16 నుంచి వచ్చే ఏడాది మార్చి 15 వరకు పొట్టి శ్రీరాములు 125వ జయంతి  ఉత్సవాలు 

పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ ఏడాది మార్చి 16 నుంచి వచ్చే ఏడాది మార్చి 15 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ సమావేశంలో మంత్రి సవిత, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డూండీ రాకేశ్‌ ప్రసంగించారు. భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌, జీఏడీ ముఖ్యకార్యదర్శి సురేశ్‌కుమార్‌ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

వివరాలు 

భాషాప్రయుక్త రాష్ట్రాలకు మార్గదర్శి: కందుల దుర్గేష్‌, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి 

దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వెనుక ప్రధాన ప్రేరణ పొట్టి శ్రీరాములి ఆత్మార్పణేనని భాషా సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలోనూ ఆయన కీలకంగా పోరాడారని గుర్తుచేశారు. భావితరాల్లో ఆయన త్యాగస్ఫూర్తిని నిలిపేందుకే కూటమి ప్రభుత్వం అమరావతిలో విగ్రహ ప్రతిష్ఠకు శ్రీకారం చుట్టిందన్నారు. రాజకీయాలు సేవాభావంతో ఉండాలన్న సందేశానికి పొట్టి శ్రీరాములు నిలువెత్తు ప్రతీకగా నిలిచారని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement