
AP high court: పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై జోక్యం అవసరం లేదు: హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య) విధానంలో 10 వైద్య కళాశాలలను నిర్మించి నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకునే అవసరం లేదని హైకోర్టు స్పష్టంగా తెలిపింది. ఈ విధానంలో కళాశాలలు నిర్మించడం తప్పేమిటని ప్రశ్నిస్తూ, ఈ విషయంపై పిలిచిన టెండర్లను నిలిపివేయమన్న అభ్యర్థనను తిరస్కరించింది. ప్రైవేటు సంస్థలకు పూర్తిగా అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా అని వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో ఆసుపత్రులు నిర్మించడం ఒక ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం మాత్రమేనని, రాజ్యాంగానికి లేదా చట్టానికి విరుద్ధంగా లేని విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
వివరాలు
తదుపరి విచారణఈ నెల 29కి వాయిదా
ఈ మేరకు సీఎస్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSIDC) ఎండీ, అలాగే ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఎండీకి పూర్తి వివరాలతో కౌంటర్ సమర్పించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు
నిధులు లేకుండా నిర్మాణం కష్టం
'రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరత కారణంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. అది తప్పేలా అవుతుంది? నిధుల కోసం ప్రభుత్వం బ్యాంకుల వద్దకు వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం నిధుల కొరత వల్లనే జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణాలు కూడా నిలిచిపోయాయి. డబ్బు లేకుండా ప్రభుత్వం స్వయంగా కళాశాలలు, ఆసుపత్రులను కట్టాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. నిధులు లభించినప్పుడే నిర్మాణాలు చేపట్టాలంటే అవి ఎప్పటికీ పూర్తి కావు. ఇలాంటి విషయాల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. లేనిపక్షంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి చెందవు' అని ధర్మాసనం స్పష్టంగా వ్యాఖ్యానించింది.
వివరాలు
జీవో 590పై పిల్
రాష్ట్రంలోని ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 9న జారీ చేసిన జీవో 590ను సవాలు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో ప్రజాహిత వాదన పిల్ (PIL)దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, 'ప్రజాప్రయోజనాలను పక్కనపెట్టి వైద్య కళాశాలలను ప్రైవేటు చేతుల్లోకి ఇస్తున్నారు.బిడ్‌లో గెలిచిన సంస్థ లేదా ఏజెన్సీ 33 ఏళ్లపాటు ఆ కళాశాలను నిర్వహించే హక్కు పొందుతుంది. 2024 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఈ నిర్మాణాలను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకుంది.నిధుల కొరత లేదని ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది.
వివరాలు
12 వైద్య కళాశాలల కోసం రూ.5,800 కోట్ల పరిపాలనాపరమైన అనుమతులు
అంతేకాకుండా, గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలల కోసం రూ.5,800 కోట్ల పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు' అని తెలిపారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ, 'పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారంటే సరిపోతుందా? వాటికి నిధులు విడుదల చేయకపోతే ఉపయోగమేమిటి? అంత పెద్ద మొత్తంలో సొమ్మును ప్రభుత్వం ఖర్చు చేసే స్థితిలో ఉండాలి కదా?' అంటూ వ్యాఖ్యానించింది.