
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ..
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాజంపేట లోక్‌సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో కలకలం రేపిన మద్యం స్కాం కేసులో మిథున్ రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, నేడు ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు షాకిచ్చింది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు త్రోసిపుచ్చింది.
వివరాలు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డిని ఇప్పటికే ప్రశ్నించిన సిట్
ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయనేది విధితమే. గతంలో కూడా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం పెట్టిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. అనంతరం దర్యాప్తులో కొత్త వివరాలు వెలుగు చూసాయని, మిథున్ రెడ్డి ఈ స్కామ్‌లో వ్యూహ రచన చేసి, తన ఎంపీ హోదాను దుర్వినియోగం చేశారని,వివిధ మార్గాల్లో మిథున్ రెడ్డికి చెందిన కంపెనీలకు రూ.5 కోట్ల వరకు నిధులు జమయ్యాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన కౌంటర్‌లో స్పష్టంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఏపీ లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఇప్పటికే ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
వివరాలు
ఇది కేవలం కట్టుకథ: మిథున్ రెడ్డి
మొత్తం 8 గంటల పాటు విచారించి, మిథున్ రెడ్డి స్టేట్మెంట్‌ను రికార్డు చేసి, సంతకాలు తీసుకున్నారని సమాచారం. ఈ విచారణలో సిట్ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి పాత్ర, అదాన్ డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్ల అంశాలపై మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, దీనిపై మిథున్ రెడ్డి తన వాదనలో ఇది కేవలం కట్టుకథగా అభివర్ణించారు. గతంలోనూ తనపై అనేక ఆరోపణలు చేశారని, కానీ వాటిలో ఒక్కదానికీ ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. గనుల అంశంలోనూ అవకతవకల ఆరోపణలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. కానీ ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపితం కాలేదని పేర్కొన్నారు.
వివరాలు
ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి ప్రయత్నం విఫలం
ప్రస్తుతం మద్యం స్కాం కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఏపీలో మద్యం సరఫరాలో పారదర్శకతను తగ్గించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని మాన్యువల్ మోడల్‌గా మార్చడంలో మిథున్ రెడ్డి కీలకపాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. మొత్తంగా ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది. హైకోర్టులో మరోసారి ఆయనకు ఊరట దక్కలేదు. గతంలోనూ ఇలాంటి పరిస్థితినే ఆయన ఎదుర్కొన్న సంగతి విదితమే.