
AP High Court: ఏపీ వెలుపల ఇంటర్ చదివినవారూ 'లోకలే'.. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
వైద్య విద్యలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌కి దరఖాస్తు చేసుకునేందుకు తమను రాష్ట్రానికి స్థానికులుగా పరిగణించాలని కోరుతూ ఇంటర్మీడియట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుపల చదివి, నీట్ పరీక్ష రాసిన కొంతమంది అభ్యర్థులు అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్లను ఏపీకి చెందిన స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తూ వారి దరఖాస్తులను స్వీకరించాలంటూ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరఫు కౌంటర్ అఫిడవిట్ సమర్పణ అనంతరం లోకల్, నాన్‌లోకల్ వ్యవహారంపై లోతైన విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.
వివరాలు
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కొర్రపాటి సుబ్బారావు, పీవీజీ ఉమేశ్ చంద్ర
ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం విచారించింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన ఎస్‌కే కమరుద్దీన్, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళ గ్రామానికి చెందిన సనపల వెంకటరమణతో పాటు మరో 51 మంది అభ్యర్థులు ఈ వ్యాజ్యాలు హైకోర్టులో అత్యవసరంగా దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కొర్రపాటి సుబ్బారావు, పీవీజీ ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు.
వివరాలు
స్థానికతకు న్యాయ పరమైన వాదనలు
న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు వాదనలు వినిపిస్తూ కమరుద్దీన్ ప్రాథమిక విద్యను పూర్తిగా ఏపీలోనే అభ్యసించారని వివరించారు. ఆయన 1 నుండి 5వ తరగతి వరకు ప్రత్తిపాడు ప్రాంతంలో, 6 నుండి 10వ తరగతి వరకు గుంటూరులో చదివారని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యను తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో అభ్యసించారని, అయినప్పటికీ ఆయన తల్లిదండ్రులు ఇప్పటికీ ఏపీలోనే నివసిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఆయనను రాష్ట్రానికి చెందిన స్థానిక అభ్యర్థిగా పరిగణించాల్సిన అవసరం ఉందని వాదించారు.
వివరాలు
కేవలం ఇంటర్మీడియట్‌ను రాష్ట్రం వెలుపల చదివిన కారణంతో..
52 మంది అభ్యర్థుల తరఫున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు కొనసాగించారు. పిటిషనర్లందరూ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏపీలోనే విద్యనభ్యసించారని, వారి ఆధార్ కార్డులు, నివాస ధ్రువీకరణ పత్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందినవేనని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ రాష్ట్రంలోనే ఉంటున్నారని వివరించారు. కేవలం ఇంటర్మీడియట్‌ను రాష్ట్రం వెలుపల చదివిన కారణంతో అభ్యర్థులను నాన్-లోకల్‌గా పరిగణించడం న్యాయవిరుద్ధమని స్పష్టం చేశారు.
వివరాలు
జీవోలపై అభ్యంతరాలు
నీట్ పరీక్ష రాసే సమయానికి అభ్యర్థులు వరుసగా నాలుగు సంవత్సరాలు ఏపీలో చదివి ఉండాలి లేదా రాష్ట్రంలో నివసించి ఉండాలి అని ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోలు చట్టవిరుద్ధమని న్యాయవాదులు వాదించారు. ఈ జీవోల ఆధారంగా అభ్యర్థులను నాన్‌లోకల్‌గా పరిగణించడం వారి హక్కులను హరించే చర్యగా అభివర్ణించారు. పిటిషనర్లను రాష్ట్రానికి చెందిన స్థానికులుగా పరిగణించి, వైద్య విద్య ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును అభ్యర్థించారు.
వివరాలు
విశ్వవిద్యాలయం తరఫు వాదనలు
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం తరఫున న్యాయవాది టీవీ శ్రీదేవి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోల ప్రకారం, నీట్ పరీక్ష రాసే సమయానికి అభ్యర్థులు గత నాలుగు సంవత్సరాలుగా ఏపీలో చదివి ఉండాలి లేదా నివసించి ఉండాలని నిబంధన ఉందని పేర్కొన్నారు. పిటిషన్లకు సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలనీ, ఇందుకోసం కొంత సమయం అవసరమని కోర్టును కోరారు.